ప్రతిపక్షాలను ప్రశ్నించిన ఎంఎల్‌ఎ గ్రంధి
ప్రజాశక్తి - భీమవరం రూరల్
భీమవరం పట్టణాన్ని నాడు, నేడు తాను మాత్రమే అభివృద్ధి చేశానని, మీ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో ఒక్క ల్యాండ్ మార్క్ చూపించాలని ప్రతిపక్షాలను ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు. బుధవారం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా 32వ వార్డు కరణం వీధిలో రూ.39.90 లక్షలతో నిర్మించిన ఇందిరా గాంధీ బొమ్మ నుండి విజయా నివాస్ వరకూ సీసీ రోడ్డు, సీసీ డ్రెయినేజీ, ఆర్‌సిసి స్లాబ్ కల్వర్టులను ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.49.70 లక్షలతో 32వ వార్డులోని సాయిబాబా గుడి నుండి రాయలం వంతెన వరకూ సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్, కల్వర్టు పనులకు, 37వ వార్డులో రూ.32.60 లక్షలతో నిర్మించనున్న రోడ్డు, డ్రెయినేజీ, కల్వర్టు పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. భీమవరం పట్నాన్ని అన్ని హంగులతో తీర్చి దిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ, రెండో పట్టణ జెసిఎస్ కన్వీనర్ గాదిరాజు సుబ్రహ్మణ్యంరాజు, కొల్లి ప్రసాద్, చెన్ను చంటి, పట్టణ కన్వీనర్ తోట భోగయ్య పాల్గొన్నారు.










