Apr 05,2023 21:04

ప్రజాశక్తి - భీమవరం
మహనీయులు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. జగజ్జీవన్‌ రామ్‌ చిన్న గ్రామంలో జన్మించి వివక్షత, అసమానతలు, సదుపాయాలులేని కాలంలో వారి పోరాట ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి దేశ ఉప ప్రధాని స్థాయికి చేరుకున్నారన్నారు. జెసి జెవి.మురళి మాట్లాడుతూ ధైర్యంగా ముందుకొచ్చి పోరాడడం కొందరికే సాధ్యమన్నారు. వారిలో డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ ఒకరన్నారు. తొలుత జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, ఎంబిసి ఛైర్మన్‌ పెండ్ర వీరన్న, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె.శోభారాణి, డిఇఒ ఆర్‌.వెంకటరమణ పాల్గొన్నారు.
తణుకు : ముఖ్యమంత్రి జగ్జీవన్‌రామ్‌ బాటలో నడిచి బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. జగజ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఎన్‌టిఆర్‌ పార్క్‌ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎంఎల్‌ఎ రాధాకృష్ణ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి నివాళులర్పించారు.
కాళ్ల:బాబూ జగ్జీవన్‌రామ్‌ దేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలందించారని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి కొనియాడారు. వేంపాడులో జగ్జీవన్‌ రామ్‌ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ప్రశాంతి, జిల్లా ఎస్‌పి రవిప్రకాష్‌ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఇర్రింకి పద్మావతి, భీమవరం ఆర్‌డిఒ దాసి రాజు, జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ కె.శోభారాణి, ఎంపిడిఒ జి.స్వాతి, తహశీల్దార్‌ కృష్ణారావు పాల్గొన్నారు.
భీమవరం : బడుగు బలహీనవర్గాలకు బాబు జగజ్జీవన్‌ రామ్‌ అందించిన సేవలు అమోఘమని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి కొనియాడారు. భీమవరం యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో జగ్జీవన్‌రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయరామరాజు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన బి.గోపీమూర్తి జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా బడుగు బలహీన వర్గాలకు ఆయన సేవ చేశారన్నారు. నలభై సంవత్సరాలకుపైగా వివిధ శాఖలకు క్యాబినెట్‌ మంత్రిగా చేసి పేదలకు విశేషసేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు కుమార్‌ బాబి, రామకృష్ణ ప్రసాద్‌ రామ కృష్ణంరాజు, త్రిమూర్తులు, శ్యామ్యూల్‌రాజు, శ్రీనివాస్‌, గోవింద్‌, అబ్రహం స్వామి, మోహనరావు పాల్గొన్నారు.
ఆచంట : మహోన్నతుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ అని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు కొనియాడారు. జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా కందరవల్లిలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఎంఎల్‌ఎ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయ సాధనకు జగ్జీవన్‌రామ్‌ కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ చిల్లే లావణ్య, ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు, సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్షులు సుంకర సీతారాం పాల్గొన్నారు.