మహిళలు స్వయం శక్తితో ఎదగాలి: డీఆర్డీఏ పీడీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: మహిళలలో స్వయంగా ఆర్థికంగా నిలదోక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టడం జరుగుతుందని మహిళల ఆర్థిక అభివద్ధి కోసం అనేక సంస్థలు కూడా ముందుకు రావడం ఆనందంగా ఉందని వాటిని ఉపయోగించుకుని మరింత ముందుకు మహిళలు ఎదగాలని డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ డీఎంకే తులసి అన్నారు. బుధవారం ఉదయం చిత్తూరులోని ట్రైనింగ్ సెంటర్లు సౌరశక్తితో పనిచేసే పలు పరికరాలను ఉపయోగించి జీవనోపాధి ఆలంబన చేసుకునేందుకు ఒక ప్రైవేటు సంస్థ, డిఆర్డిఏలో సంఘసభ్యులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు సౌరశక్తి ద్వారా తక్కువఖర్చుతో పలు యంత్రాలను ఉపయోగించుకొని ఆర్థికంగా అభివద్ధి చెందవచ్చునని అందులో ప్రధానంగా పాలు పితికే యంత్రం, కుండల తయారీ యంత్రం, కుట్టు పని యంత్రం, రోటి తయారు చేసే యంత్రం, పిండి తయారీ యంత్రం, తాడు తయారు చేసే యంత్రం, ఫోటో కాఫీ తయారు చేసే యంత్రం, పిండిమిల్లు యంత్రం, సౌరశక్తితో నీటివ్యవస్థ, హైడ్రోపోరెన్సీక్, సౌర శక్తితో పంటలకు స్ప్రే చేసే యంత్రాల గురించి డెమో కార్యక్రమం మహిళలకు ఇప్పించారు. ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే అందుకు కావాల్సిన యంత్రాలు అవసరమని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తుల విలువ చేసే యంత్రాలను పొందడం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివద్ధి చెందవచ్చునని అన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాస్థాయిలో మొదట అవగాహన కల్పించడం జరుగుతుందని రానున్న కాలంలో క్షేత్రస్థాయిలో వీరికి అవగాహన కల్పించి యంత్రాల వైపు మొగ్గుచూపేలా చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను మహిళల ఆర్థిక అభివద్ధి కోసం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఏపీఎంలు, ఇతర సిబ్బంది, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.










