Jul 12,2023 21:19

ప్రజాశక్తి - ఆకివీడు
           ప్రతి మహిళా తన జీవితంలో తనకు ఎదురైన సవాళ్లను తమకు అనుకూలంగా మార్చుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని మహిళా సాధికారత విభాగం రాష్ట్ర సభ్యురాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ జె.శ్యామలాదేవి అన్నారు. మండలంలోని దుంపగడప వివి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మహిళా సాధికారితా విభాగం మహిళా హక్కుల సాధనకు గల అవకాశాలు అంశంపై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.సుజాత అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా జె.శ్యామలాదేవి మాట్లాడుతూ మంచి విషయాలను విద్యార్థినులు తల్లిదండ్రులు, సమాజం, గురువులు, స్నేహితుల నుంచి తెలుసుకోవాలన్నారు. ఈ విధానంలో ఉన్నత స్థితికి చేరవచ్చన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏ పరిస్థితులనైనా సానుకూలంగా స్వీకరించినప్పుడు వారు లక్ష్యాన్ని చేరుకోగలరని వివరించారు. అనంతరం శ్యామలాదేవిని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.సుజాత, అభివృద్ధి కమిటీ కార్యదర్శి నంబూరి వెంకటరామరాజు (తాడినాడ బాబు) కళాశాల మహిళా లెక్చరర్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ సిహెచ్‌..హరనాథ్‌, మహిళా విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ ఎ.ఇందిర, చరిత్ర అధ్యాపకురాలు ఎస్‌.జ్యోతి, వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు పి.సాయిసుప్రజ, సిహెచ్‌.భార్గవి, కంప్యూటర్‌ అధ్యాపకులు జి.పావని పాల్గొన్నారు.