Mar 03,2023 21:00

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
ఆధునిక కాలంలో మహిళ అబల కాదు సబలగా మారిందని, మహిళలను గౌరవించే ప్రాంతాలు అభివృద్ధి పథంలో ఉంటాయని డిఆర్‌ఒ కృష్ణవేణి అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో పాస్తుల సాగరం మున్సిపల్‌ హైస్కూల్లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను డిఆర్‌ఒ కృష్ణవేణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇంటికే పరిమితమైన మహిళలు నేటి సమాజంలో విద్య, వైద్య సామాజిక, కళా రంగంలో ముందుంజలో ఉంటున్నారన్నారు. పురుషులకు దీటుగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారన్నారు. హెచ్‌ఎం కోడె వెంకట్రావు మాట్లాడుతూ మూడున్నర దశాబ్ధాలుగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మహిళలను గౌరవించాలన్నారు. లయన్స్‌ క్లబ్‌ నాయకులు కంతేటి వెంకటరాజు, స్కూల్‌ ఉపాధ్యాయినులు మాట్లాడారు. అనంతరం డిఆర్‌ఒ కృష్ణవేణిని సత్కరించారు. మహిళా సాధికారిత ర్యాలీ నిర్వహించారు.