ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు : మహిళల్లో క్యాన్సర్ చికిత్స కు స్విమ్స్ చేయూతనందించడం అభినందనీయమని తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఎంపీపీ బాలం యుగంధర్ రెడ్డిలు అన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం స్విమ్స్ ఆధ్వర్యంలో పింక్ బస్సు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జబ్బు చేసి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు బాధ పడకూడదు, బయపడకూడదన్నది ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్యేయమన్నారు. ప్రదానం గా మహిళల్లో వచ్చే క్యాన్సర్ నివారణకు స్విమ్స్ చేపట్టిన ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ చికిత్స కోసం స్విమ్స్ వైద్యశాల ప్రత్యేకంగా మహిళా వైద్యులను నియమించి సేవలను అందిస్తోందన్నారు. మండలంలో వివిధ గ్రామాల నుంచి 150 మంది వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మనోహర్, విజయ్ కుమార్, ఎంపీడీవో అమర్నాథ్, తహశీల్దార్ హనుమాన్ నాయక్, స్విమ్స్ పీఆర్ ఓ పద్మనాభరెడ్డి, స్విమ్స్ రేడియాలజీ, గైనకాలజీ, ఆంకాలజీ, డెంటల్ కు సంబంధించిన మహిళా వైద్యులు పాల్గొన్నారు.










