ప్రజాశక్తి-కందుకూరు : మంగళగిరిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న స్త్రీ శక్తి కార్యక్రమం స్ఫూర్తితో కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రణాళికలు రూపొం దించారు. అందుకోసం నియోజకవర్గంలోని మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. మొదటి బ్యాచ్ కింద 60 మంది మహిళలకు రెండు నెలల పాటు శిక్షణ నిమిత్తం ఆగస్టు 21వ తేదీన నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కందుకూరులోని టిడిపి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో తరగతులు ప్రారంభించారు. శనివారంతో మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహిళలంతా నాగేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. ఆయన చేత కేక్ కట్ చేయించి, ఉచితంగా శిక్షణ ఇప్పించినందుకు కతజ్ఞతలు తెలియజేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో కుటుంబాన్ని పోషించుకుని, ఆర్థికంగా నిలదొక్కుకుంటారన్న ఆలోచనతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. మంగళగిరిలో లోకేష్ నిర్వహిస్తున్న స్త్రీ శక్తి కార్యక్రమమే తనకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మొదటి బ్యాచ్ కు శిక్షణ పూర్తయిందని, ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని నాగేశ్వరరావు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు మాట్లాడుతూ, తమకు నాగేశ్వరావు గారు ఎంతో ఉపకారం చేశారని, ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు.కార్యక్రమంలో ప్రతినిధి షేక్ రఫీ, ట్రైనర్స్ లలిత, యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు










