Jul 15,2023 09:01

విలేరులతో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి

         అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్త పోరుయాత్రను చేపడుతున్నట్లు ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి తెలిపారు. శుక్రవారం నాడు అనంతపురం జిల్లా కేంద్రంలోని రేడియెంట్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో మహిళలపై హింస రోజురోజుకు పెరిగిపోతోందన్నారు. ఈ హింసను నిర్మూలించాలని ఐద్వా ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్ట్‌ 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు మహిళా జాతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నుంచి ఒక మహిళా జాతా, విశాఖపట్టణం నుంచి మరొక మహిళా జాతాలు ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు 8వ తేదీన విజయవాడలో మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతా ముగింపు సభకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ కార్యదర్శి బృందాకరత్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. దేశం, రాష్ట్రంలో సాధారణ మహిళలు, పిల్లలు, పెద్దలకు ఎవరికీ భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రతి జిల్లాలోనూ ఏదో ఒక చోట మహిళలపై వివిధ రూపాల్లో దాడులు జరుగుతున్నాయన్నారు. వీటిని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయన్నారు. సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఆందోళనలు చేస్తే మహిళా కమిషన్‌ వచ్చి అప్పటికప్పుడు హడావుడి చేయడం మినహా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడానికే దిశా చట్టం ఉందన్నారు. మహిళలపై హింస కేసులను 41 రోజుల్లో పాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా విచారణ జరిపించి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. మహిళా రెజ్లర్లను ఏకంగా బిజెపి ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడితే అతనిపై చర్యలు తీసుకోకుండా కేంద్రం ప్రేక్షక పాత్ర వహిస్తోందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అనే పేరుతో నీచమైన సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం లేక న్యాయం కోసం మహిళలు కేసులు పెట్టాలన్నా భయపడే పరిస్థితులు నేడు దాపరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం, రాష్ట్రంలో నేరాల నియంత్రణకు న్యాయనిపుణులు, రిటైర్డ్‌ న్యాయమూర్తులు, ఇతర అధికారులతో కలిపి స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే విషయాన్ని జాతాల సందర్భంగా డిమాండ్‌ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి, రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీదేవి, జిల్లా అధ్యక్షురాలు శ్యామల పాల్గొన్నారు.