Jun 25,2023 21:03

ఇల్ల నిర్మాణాలపై లబ్ధిదారులతో చర్చిస్తున్న కలెక్టర్‌ గౌతమి

          ప్రజాశక్తి-గార్లదిన్నె   మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ గౌతమి తెలిపారు. మండల కేంద్రంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద మంజూరై పూర్తయిన ఇళ్లను ఎంపి తలారి రంగయ్యతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా గౌరవం పెంచేందుకే మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు జగనన్న కాలనీలో 50 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన వాటిని కూడా త్వరలో పూరి చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఆర్థిక స్థోమత లేకపోయినా వాటికి బ్యాంకుల ద్వారా, స్వయం సహాయక సంఘాల శ్రీనిధి, ముద్రా రుణాలు ఇప్పించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే రోడ్లు, విద్యుత్తు, డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులు పూర్తి చేసిన వారిని ఆదర్శంగా తీసుకుని పూర్తి చేయాలన్నారు. ఎంపి తలారి రంగయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం ఇల్ల నిర్మాణాలను చేపట్టిందన్నారు. కావున ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని మరొకసారి జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ చెన్నకేశవనాయుడు, ఎంపిపి వెంకటనారాయణ, మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ నారాయణరెడ్డి, వైస్‌ ఎంపిపి రామ్మోహన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్‌ ఉషారాణి, ఎంపిడిఒ తేజష్ణ, వైసిపి నాయకులు, కార్యకర్తలు, ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.