ప్రజాశక్తి - అత్తిలి
మహిళలకు ఆసరాగా ఉండడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సోమవారం అత్తిలి వల్లీ దేవసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపంలో డ్వాక్రా మహిళలకు వైఎస్‌ఆర్ ఆసరా నగదు విడుదల కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మండలంలో 1,357 స్వయం సహకార సంఘాలకు 13,687 మంది సభ్యులు ఉన్నారన్నారు. మొదటి విడత నుండి ఇప్పటివరకు ఒక్కో ఏడాది రూ.13.74 కోట్లు ఆసరా కల్పించగా, ఇంకా రూ.13.74 కోట్లు ఇవాల్సి ఉందన్నారు. అనంతరం చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అత్తిలి సర్పంచి గంట విజేత, ఎంపిపి మక్కా సూర్యారావు, ఎఎంసి ఛైర్మన్ బుద్దారతి భరణి ప్రసాద్ పాల్గొన్నారు.
నరసాపురం : ప్రతి మహిళా పేదరికాన్ని జయించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం లిఖితపూడి గ్రామంలో మండలంలోని కొప్పర్రు, బేతపూడి, మల్లవరం, మల్లవరంలంక, లిఖితపూడి, సరిపల్లి, చిట్టవరం, గొంది, కొత్త, పాత నవరసపురం గ్రామాలకు వైఎస్‌ఆర్ ఆసరా మూడో విడత రుణమాఫీ అందజేసే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి నాలుగు విడతలలో ఆసరా రుణమాఫీ డబ్బులు అందించడం జరుగుతుందన్నారు. నరసాపురం నియోజకవర్గానికి రూ.150 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా చనిపోయినట్లయితే వైఎస్‌ఆర్ బీమా ద్వారా ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం జెడ్‌పిటిసి బొక్కా రాధాకృష్ణ, ఎంపిపి మైలాబత్తుల సోనీ, ఎంపిడిఒ వైఎన్.శివప్రసాద్‌యాదవ్ పాల్గొన్నారు.










