ప్రజాశక్తి-ఉరవకొండ మహిళాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉరవకొండ ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో 'వైఎస్సార్ ఆసరా' వారోత్సవాలు జరిగాయి. ఐకెపి ఎపిఎం శివయ్య, ఎంపీపీ చందా చంద్రమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఇతర ప్రతిపక్షాలతో పాటు ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. ప్రజలను అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఎంతో పారదర్శకంగా నేరుగా వారి అకౌంట్లోకి నగదును బదిలీ చేస్తుంటే చూసి ఓర్చుకోలేని వారు రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటూ కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు లాగా జగన్మోహన్‌రెడ్డి మోసం చేయలేదన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఇచ్చిన మాట కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలను అభివద్ధి చేస్తున్నారని చెప్పారు. అక్కచెల్లెమ్మలకు మూడో ఏడాది కూడా డ్వాక్రా రుణమాఫీకి రూ.6 వేల కోట్లు అకౌంట్లలో జగన్మోహన్‌రెడ్డి జమ చేశారన్నారు. మూడు విడతల్లో రూ.19 వేల కోట్లు మహిళల ఖాతాల్లో ఒక్క రుణమాఫీకే జమ అయిందన్నారు.అక్కచెల్లెమ్మలను మహారాణులుగా చేయడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని పేర్కొన్నారు. అనంతరం 995 మహిళా సంఘాలు, 9,995 మంది మహిళలకు 7 కోట్లా 57 లక్షల 47 వేల 9 రూపాయల మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రమౌళి, కురుబ, ఎంబిసి రాష్ట్ర డైరెక్టర్లు గోవిందు, జోగి వెంకటేశులు, జడ్పిటిసి పార్వతమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సుశీలమ్మ, సర్పంచ్ లలిత, ఉప సర్పంచి వన్నప్ప, పార్టీ పట్టణ అధ్యక్షుడు బ్యాంకు ఓబులేసు, వివిధ సంఘాల మహిళలు, అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యాడికి : స్థానిక చౌడేశ్వరి కల్యాణ మండపంలో వైఎస్సార్ ఆసరా మూడో విడత సంబరాలను మహిళా సంఘాల సభ్యులు సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ కోట్ల రూపాయలతో మహిళా సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆసరా కల్పించారన్నారు. ఆసరాతో జీవనోపాధి మహిళలకు ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉమాదేవి, వైసీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, తహశీల్దారు అలెగ్జాండర్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, సర్పంచి అనురాధ, ఉప సర్పంచి కాసా చంద్రమోహన్, వైస్ ఎంపీపీలు హసీనా బేగం, చెన్నప్ప, నాయకులు బొంబాయి బ్రదర్స్ వెంకటనాయుడు, బోగాతి బ్రహ్మానంద రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, బాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దవడుగూరు : స్థానిక జేసీ ఫంక్షన్ హాల్‌లో వైఎస్‌ఆర్ ఆసరా మూడవ విడుత సంబరాలను ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వైసిపి నాయకులు కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.










