Jun 14,2023 22:56

అమ్మ డెయిరీ లోగోను ఆవిష్కరిస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషశ్రీ చరణ్‌, జిల్లా ప్రజాప్రతినిధులు

        అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్రంలో మహిళాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటును అందిస్తోందని అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పునరుద్ఘాటించారు. అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని ఆలమూరు వద్ద రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సారధ్యంలో ఏర్పాటు చేసిన తోపుదుర్తి మహిళా సహకార 'అమ్మడెయిరీ'ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మహిళలు, ప్రజలను ఉద్ధేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పాడి రైతులు, మహిళలకు మేలు జరిగేలా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మడెయిరీని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ప్రజల కోసం దీనిని ఆయన రూ.20 కోట్ల సొంత నిధులతో ఏర్పాటు చేశారన్నారు. ఇందులో మొత్తం 10 వేల మంది మహిళా సభ్యులు ఉండడం రాష్ట్రంలో ఇదే ప్రథమం అన్నారు. ప్రారంభంలోనే లక్ష లీటర్ల కెపాసిటీతో డెయిరీని ఏర్పాటు చేయడం సామన్యమైన విషయం కాదన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డికి అందరూ అండగా నిలవాలని ఆకాంక్షించారు.
చంద్రబాబు రాజకీయంగా శక్తిహీనుడు
చంద్రబాబు నాయుడు రాజకీయంగా శక్తిహీనుడు అయ్యాడని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఒంటిరి పోరాటం చేయలేక అందిరి సహకారం తీసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. రాయలసీమకు ఎవరు ఎంత మేలు చేశారన్న విషయం ప్రజలకు బాగా తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ ఫలాలు వచ్చే ఎన్నికల్లో వైసిపి మరోసారి అధికారాన్ని తెస్తాయన్నారు. అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి అమ్మడెయిరీ లోగాను మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీలు వాల్మీకీ మంగమ్మ, శివరామరెడ్డి, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.