అనంతపురం కలెక్టరేట్ : దేశంలో రెజ్లింగ్ క్రీడలో ఒలింపిక్ మెడల్స్ సంపాదించి, దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన రెజ్లర్, పహిల్వాన్లపై రెజ్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బిజెపి ఎంపీ బ్రిజు భూషణ్ సింగ్ లైంగిక దాడులకు పాల్పడడం దుర్మార్గమని తక్షణం ఆయన్ను అరెస్టు చేయాలని ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడుతున్న బిజెపి ఎంపీ బ్రిజు భూషణసింగ్‌పై అత్యాచార కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం అనంతపురం నగరంలోని గాంధీ విగ్రహం దగ్గర ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశ ప్రతిష్ట, కీర్తిని తమ క్రీడల ద్వారా ప్రపంచానికి చాటుతున్న మహిళా రెజ్లర్స్‌కు దేశంలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో పాటు వారిపైన లైంగిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. గత మూడు రోజులుగా ఢిల్లీ నగరంలోని జంతర్‌మంతర్ పలువురు రెజ్లర్స్ వారికి న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు చేస్తున్నారన్నారు. ఈ సంఘటన చూస్తే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశాన్ని ఏలుతున్న బిజెపి పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా ఈ మహిళా క్రీడాకారులు జరుపుతున్న న్యాయ పోరాటానికి ఢిల్లీ ప్రజలు, మేధావులు మద్దతు తెలుపుతూ ధర్నాలో కూర్చున్నారని చెప్పారు. గత మూడు నెలలుగా సదరు బిజెపి ఎంపీచేత అత్యాచార వేధింపులు, అవమానాలకు గురైన రెజ్లర్లు అందరూ గతంలో కూడా నిరసన తెలిపారన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజుభూషణ్‌సింగ్ బిజెపి నేత కావట్టి ప్రధాని మోడీ రక్షిస్తున్నారని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో మహిళా క్రీడాకారిణులు మూడు రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారని చెప్పారు. దేశప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్న మహిళా క్రీడాకారిణులకే రక్షణ లేకపోతే దేశంలో సామన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తక్షణం ఈఘటనపై బిజెపి ప్రభుత్వం స్పందించి ఎంపీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహా, రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కష్ణమూర్తి, డివైఫ్‌ఐ జిల్లా కోశాధికారి నూరుల్లా, శివ, డాన్సుమాస్టర్ వన్నూర్ స్వామి, రజిత, రామంజినమ్మ, అరుణమ్మ, పాల్గొన్నారు.










