ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లా నుంచి వేరు చేసిన విషయంలో, ప్రజలకు తీరని అన్యాయం చేసిన ద్రోహి ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి అని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావుపేర్కొన్నారు. ఆయన్ను కందుకూరు ప్రజలు ఎప్పటికీ క్షమించరని, రాబోయే ఎన్నికలలో ఆయనకు బుద్ధి చెప్పబోతున్నారని స్పష్టం చేశారు. కందుకూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన నాగేశ్వరరావు ఎంఎల్‌ఎ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీ అవినీతికి సాక్షాలివిగో అంటూ పత్రికలలో వచ్చిన కథనాల క్లిప్పింగులను చూపించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ 30 ఇయర్స్ ఇండిస్టీ అని చెప్పుకునే మహీధర్ రెడ్డి, 50 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయలేనంతగా, కందుకూరు ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడంలో ఎంఎల్‌ఎ తెర వెనుక కథ నడిపారని విమర్శించారు. కేవలం ఎంఎల్‌ఎ ఆర్థిక ప్రయోజనాల కోసమే ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. గతంలో కందుకూరు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన బీసీ వర్గానికి చెందిన బూర్సు మాలకొండయ్యను ఇదే పెద్దమనిషి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారో, అప్పట్లో అందరూ గమనించారని చెప్పారు.1994లో రాళ్లపాడు ప్రాజెక్టు ఎందుకు తెగిపోయిందో, దాని వెనుక ఎవరి హస్తం ఉందో ప్రజలు ఇంకా మరిచిపోలేదని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రాజకీయంగా తమను ప్రశ్నించే ముందు, ఎంఎల్‌ఎ ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి, ఎలా వచ్చారో గుర్తు చేసుకుంటే మంచిదని నాగేశ్వరరావు హితవు పలికారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే, రెబెల్ గా నిలిచి, పార్టీ అభ్యర్థిపై కక్షగట్టి ఓడించిన ఘనత ఆయనదని విమర్శించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కందుకూరు గురించి ఏనాడూ పట్టిం చుకోకుండా, కేవలం సొంత ఆదాయం పైనే దష్టి పెట్టిన ఘనుడు మహిధర్ రెడ్డి అని నాగేశ్వరరావు విమర్శించారు. మన్నేరు, పాలేరు నుంచి ప్రతి రోజు వందల ట్రిప్పుల ఇసుక తరలించి అమ్ముకుంటున్నారని, ఇరిగేషన్ కాంట్రాక్టులన్నీ మీ బినామీలైన నెల్లూరుకు చెందిన కంపెనీలకే కట్టబెడుతుండడం నిజం కాదా అని ఇంటూరి నాగేశ్వరరావు నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల సహకారంతో మహీధర్ రెడ్డిని ఓడించి ఇంటికి పంపిస్తానని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నాదెళ్ల వెంకట సుబ్బారావు, రాష్ట్ర సాంస్కతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల వెంకటరమణయ్య, రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు రెబ్బవరపు మాల్యాద్రి ఉన్నారు.










