Oct 02,2023 22:09

గాంధీ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
అహింసే ఆయుధంగా దేశానికి స్వతంత్రం తెచ్చిన మహానీయుడు మహాత్మా గాంధీ అని, ఆయన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. గాంధీ 154వ జయంత్యుత్సవాలు సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్ర పటానికి సోమవారం పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా గాంధీ కలలు కన్నారని అన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతిఒక్కరూ దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాగే లాల్‌ బహదూర్‌ శాస్త్రి రైతులకు అందించిన సేవలను గుర్తుచేశారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, ట్రైనింగ్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనాలు మాట్లాడుతూ తన ప్రాణాలను పణంగా పెట్టి భారతీయులకు స్వేచ్ఛనిచ్చిన మహావ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె.బాలమాన్‌సింగ్‌, కలెక్టరేట్‌ ఎఒ రాజేశ్వరరావు,, హెచ్‌.సెక్షన్‌ శ్రీకాంత్‌, బి.సెక్షన్‌ సురేష్‌, రామ్మూర్తి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న బాపూజీ ఏకపాత్రాభినయం
గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా తాడివలస ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థి బాపూజీ జీవితచరిత్రను ఏకపాత్రాభినయంగా ప్రదర్శించారు. గాంధీజీ ఆశయాలు, ఆలోచనలను భావితరాలకు అందించే విధంగా చక్కగా ఆ విద్యార్థి చేసిన ఏకపాత్రాభినయం ఆహుతులను ఆకట్టుకుంది. కమిషనర్‌ ఓబులేసు, విశ్రాంత జెసి రజనీకాంతరావు ఆ విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు జామి భీమశంకర్‌, వావిలాపల్లి జగన్నాథంనాయుడు, ఎం.ప్రసాదరావు, ప్రొఫెసర్‌ విష్ణుమూర్తి, నటుకుల మోహన్‌, బాడాన దేవభూషణం, హారికాప్రసాద్‌, నిక్కు అప్పన్న, చింతాడ కృష్ణమోహన్‌, ముని శ్రీనివాసరావు, పందిరి అప్పారావు, విశ్రాంత ప్రిన్సిపాల్‌ జి.ఎస్‌.రామారావు పాల్గొన్నారు.