రూ.4 కోట్ల బడ్జెట్ కేటాయింపు
వీఐపీలకు ప్రత్యేక సమయం
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: దక్షిణ కైలాసంగా, వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అందుకోసం రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. స్థానిక ఆలయ పరిపాలనా భవనంలో మహాశివరాత్రి ఏర్పాట్లు, ఉత్సవాల విజయవంతంపై ఈవో పెద్దిరాజు సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతి ఏటా నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. స్వామీ అమ్మవార్ల దర్శనార్థం లక్షల కొద్దీ భక్తులు తరలి వస్తుంటారని చెప్పుకొచ్చారు. గతేడాది నిర్వహించిన ఉత్సవాలకు లక్షకు పైగా భక్తులు స్వామీ అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ సారి కూడా లక్షకు పైగా భక్తులు రానున్నట్లు సమా చారమన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కనీస సౌకర్యాలపై ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలియజేశారు. భక్తుల కనీస అవసరాలైన తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, ట్రాఫిక్, నీడ ప్రదేశాలు, స్నాన ఘట్టాలు, క్యూలైన్లు, అన్న ప్రసాదాలు ఆ మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల తాకిడి దృష్ట్యా చోరీలు జరగకుండా ఈ ఉత్సవాల్లో సీసీ కెమేరాలతో పాటు వాచ్ టవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, వైద్యం, ఫైర్, ఎలక్ట్రిసిటటీ, భద్రతా అంశాల గురించి ఆయా శాఖల సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. సాధారణ క్యూలైన్లు, లగేజీ కేంద్రాలు, స్నాన ఘట్టాలతో పాటు అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కోవిడ్ దృష్ట్యా కోవిడ్ నిబంధనల మేర భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తామన్నారు. శివరాత్రి పర్వదినం నాడు వీఐపీలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల సమయంలో మాత్రమే వీఐపీలు దర్శనాలకు రావాలని స్పష్టం చేశారు. ఉత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు గాను 500 మంది వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన మహాశివరాత్రి, రథోత్సవం, కల్యాణోత్సవం, గిరిప్రదక్షిణలకు భక్తులు పోటెత్తే అవకాశాలున్నాయనీ, అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మహాశివ రాత్రికి మహా లఘుదర్శనం ఏర్పాటు చేస్తున్నామనీ, అందులో సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ధూర్జటి కళా ప్రాంగణంలో నిర్వహించబోయే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తామని అన్నారు. భక్తులు, స్థానిక ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.










