అనంతపురం : తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా మరోమారు ప్రజలను మోసపూరిత హామీలతో మాయ చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్ విగ్రహానికి జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, వైసిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని చెప్పారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకువచ్చారన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకే నగదును జమ చేస్తున్నట్లు చెప్పారు. గత టిడిపి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోపిడీ చేశారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషలిటీ ఆస్పత్రిలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా ప్రత్యేకంగా కార్పొరేట్ తరహా చికిత్సలు అందించేందుకు మూడు స్పెషలైజేషన్‌లు ఏర్పాటు చేసారని తెలిపారు. అనంతపురం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కేవలం రోడ్లు, డ్రెయినేజీలకే రూ.650 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో మరింత అభివద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం సలీమ్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ నదీమ్, ఆహుడా ఛైర్మన్ మహాలక్షి శ్రీనివాస్, నాట్యమండలి ఛైర్మన్ హరిత, ఏడీసీసీ ఛైర్మన్ లిఖిత, వైఎస్సార్ సీపీ రీజనల్ అధ్యక్షుడు రమేష్ గౌడ్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులు, మదన్ మోహన్ రెడ్డి, కొర్రపాడు హుసేన్ పీరా, రిలాక్స్ నాగరాజు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.










