ప్రజాశక్తి - భీమవరం
దేశ భవిష్యత్తును నిర్ణయించిన గొప్ప నేత, మహా మేధావి అంబేద్కర్ అని శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అన్నారు. భీమవరం కలెక్టరేట్లో అంబేద్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ఛైర్మన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ దార్శనికుడు అంబేద్కర్ అని తెలిపారు. ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో చదువుకొని దేశం కోసం, దేశంలో అసమానతలపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారన్నారు. మహిళల విద్య కోసం ఆయన పోరాడారని, మహిళలు అన్ని రంగాల్లో సమానంగా ఉండాలని ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఉద్యోగులకు పని గంటలు 8 గంటలుగా నిర్ణయించారని, అంతకు ముందు 12 గంటలు ఉండేవని తెలిపారు. జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదని, శక్తి అని తెలిపారు. అంబేద్కర్ జీవితం ఒక పుస్తకం లాంటిదని తెలిపారు. దేశంలో కుల వ్యవస్థపై పోరాడారన్నారు. జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించేందుకు అంబేద్కర్ పోరాడారని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పిలుపునిచ్చారని తెలిపారు. ఇన్‌ఛార్జి జాయింటు కలెక్టరు ఎం.సూర్యతేజ మాట్లాడుతూ అంబేద్కర్ సోషల్ రిఫార్మెరని దేశ గమనాన్ని నిర్ణయించే వ్యక్తి అని సామాజిక మార్పు కోసం ఆనాడే కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, అడిషనల్ ఎస్‌పి సుబ్బరాజు, రాష్ట్ర సంచార జాతుల కార్పొరేషన్ ఛైర్మన్ పెండ్ర వీరన్న, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి, ఆర్‌డిఒ దాసి రాజు, డిఎస్‌పి బి.శ్రీనాథ్ పాల్గొన్నారు.
తణుకు : అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తి దాత అంబేద్కర్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బిసి కార్పొరేషన్ ఛైర్మన్ గుబ్బల తమ్మయ్య, వైసిపి పట్టణ అధ్యక్షులు మంగనసూర్య పాల్గొన్నారు. టిడిపి ఆధ్వర్యంలో మాజీ ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ నివాళులర్పించారు.
నరసాపురం రూరల్ : మహనీయుల జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి. ప్రసాదరాజు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లోని ఆయన విగ్రహానికి, క్యాంపు కార్యాలయంలోని చిత్రపటానికి పూలమాలలు వేసి ముదునూరి ప్రసాదరాజు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నిరు పేదల ఆశా జ్యోతి, మహా మేధావి అంబేద్కర్ అన్నారు. అంటరానితనం నిర్మూలన లేకుండా దేశ ప్రగతి సాధ్యపడదని ఆయన విశ్వశించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా కమిటీ ఛైర్ పర్సన్ బర్రె లీలా శంకర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ బర్రి శ్రీవెంకట రమణ జయరాజు, నేతలు పాల్గొన్నారు.
పెనుమంట్ర : అంబేద్కర్ జయంతి సందర్భంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో పెనుమంట్రలో ఆటల పోటీలు నిర్వహించారు. ముందుగా హైస్కూల్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం గ్రామ సర్పంచి తాడిపత్రి ప్రియాంక వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి తాడపత్రి ప్రియాంక మాట్లాడుతూ కెవిపిఎస్ నిర్వహిస్తున్న ఆటలపోటీలు యువత భవిష్యత్తుకు మార్గదర్శాన్ని తెస్తుందన్నారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి మావో, జిల్లా నాయకులు కె.ప్రమోద్, దేవా డిడాని, ఎన్.రత్నరాజు పాల్గొన్నారు.
గణపవరం : అంబేద్కర్ జీవితం నేటితరానికి ఆదర్శమని ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు తెలిపారు. స్థానిక మార్కెట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా డిగ్రీ కాలేజీ విద్యార్థులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు.
తాడేపల్లిగూడెం : అంబేద్కర్ స్ఫూర్తితో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి కొట్టు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేద్కర్ అందరూ చదువుకోవాలని, అసమానతలు లేని సమాజం ఏర్పడాలని కోరుకున్నారన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్ కుమార్, ప్రముఖ న్యాయవాది అద్దంకి విజయరత్నం, తెన్నేటి జగ్జీవన్, రాపాక వెంకటేశ్వరావు మాట్లాడారు.










