వెయ్యేళ్ల చరిత్రగల కాణిపాకం ఆలయంలో మార్పులు
రూ.9 కోట్లకు పైగా వెచ్చించిన దాతలు
ప్రజాశక్తి - ఐరాల
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సత్య ప్రమాణాల దేవుడు శ్రీ స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం పునర్నిర్మాణం చేసుకొని మహా కుంభాభిషేకానికి సిద్ధమైంది. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సత్య ప్రమాణం చేస్తే ఆ ప్రమాణం మేరకు కోర్టులు కూడా తీర్పు ఇచ్చాయని నానుడి ఉంది. స్వయంభుగా వెలసిన ఈ స్వామి చరిత్ర గతంలో ఈ ప్రాంతంలో ముగ్గురు అన్నదమ్ములు చెవిటి మూగ, గుడ్డి వారు వ్యవసాయం చేసేవారు. అందుకు సంబంధించి ఒక బావిలో నుంచి నీటిని తోడడానికి ఏతం ఉపయోగించేవారు. ఒక్కసారిగా బావిలోని నీరు అయిపోవడంతో తవ్వుదామని ఆలోచనతో ముగ్గురు నూతిలోకి దిగి పనులు మొదలుపెట్టారు. కొంతసేపటికి గడ్డపార నుంచి రక్తం రావడం, ఉన్న నీరంతా ఎర్రగా మారిపోవడం జరిగింది. ఆ వెంటనే వారికి ఉన్న వైకల్యం పోయి మామూలు మనుషులు అయ్యారు. ఈ విషయం విన్న చుట్టుపక్కల వారు చేరుకొని ఉన్న పరిస్థితిని చూసి ఆ రాయి చుట్టుపక్కల తవ్వడం ప్రారంభించారు. అయితే నీరు ఆగకపోవడంతో చుట్టూ తీసివేయడం వల్ల వినాయకుడు ఉద్భవించాడని పూజలు ప్రారంభించారు. ఈ బావి నీటి ద్వారా భూములు సాగయ్యేవి. తమిళ సాంప్రదాయం ఎక్కువగా ఉండటం వల్ల ఈ పారకంని కాణి పరకంగా పిలిచేవారు. కాలక్రమేనా కాణిపాకం అయ్యింది. అప్పటినుంచి పూజలు నిర్వహించేందుకు చుట్టుపక్కల గల 14 గ్రామాలకు చెందిన అన్ని కులాల వారికి సమాన ప్రాతినిధ్యం ఉండేలా నిర్ణయించుకున్నారు. స్వయంభుగా వెలసిన ఈ స్వామికి 11వ శతాబ్దంలో చోళ రాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటినుంచి భక్తుల పెరుగుదలతో పాటు ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయకుడి మూర్తి కూడా పెరుగుతూ వస్తోంది ఇందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఆలయానికి అనుబంధంగా వరదరాజస్వామి ఆలయం శివాలయం కాళికామాత ఆలయంలో నిర్మించబడ్డాయి. గత కొన్ని దశాబ్దాలుగా రోజురోజుకు స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అందుకు అనుగుణంగా ఆలయం చుట్టుపక్కల భూసేకరణ చేసి ఆలయం అభివద్ధి కోసం పలు చర్యలు చేపట్టడం జరిగింది. మొదటినుంచి ఈ ఆలయాన్ని అభివద్ధి పరిచిన 14 గ్రామాలకు సంబంధించిన వారందరూ ఉభయ దారులుగా ఆలయ అభివద్ధి కార్యక్రమాలలో ముందుండి అదేవిధంగా ఉత్సవాల నిర్వహణకు కూడా వీరే నడుం బిగించి నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడు అయినా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని దర్శించుకోవడానికి అదే విధంగా సత్య ప్రమాణాలకు కూడా నిత్యం భారీ ఎత్తున భక్తులు రావడం జరుగుతూ ఉంటుంది. స్వామి విగ్రహం లాగానే ఇక్కడ భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. స్వామివారు బావిలో నుంచి వెలిసినా నిత్యం స్వామి వారి విగ్రహం చుట్టూ నీళ్లు వస్తూనే ఉంటుంది. ఎన్నోసార్లు శ్రీ స్వామివారికి కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. గతంలో టీటీడీ వారు కాణిపాకం స్వామివారి సొమ్ముతో బంగారు రథం తయారు చేసి ఇచ్చారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి నుంచి తొమ్మిది రోజులు నవరాత్రి బ్రహ్మౌత్సవాలు మరో 12 రోజులు పాటు ప్రత్యేక ఉత్సవాలు మొత్తం 21 రోజులపాటు ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు. చుట్టుపక్కల స్వామివారిని కొలిచే వివిధ కులాలకు చెందిన 14 గ్రామాల వారికి అవకాశం కల్పించే విధంగా కులాల ప్రకారంగా గతంలోని ఉత్సవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున నిర్వహించుకునే అవకాశం కల్పించడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ కులానికి సంబంధించిన వారే స్వామివారికి అభిషేకం గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని అభివద్ధి పరచాలని అమెరికాలో స్థిరపడ్డ ఆంధ్రులు ఐకా రవి, శ్రీనివాస్‌లు ముందుకు రావడంతో ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, అప్పటి కార్య నిర్వహణ అధికారి వెంకటేష్ లను సంప్రదించారు. గత ఏడాది శంకుస్థాపన జరిగింది. వర్షాల వల్ల కొంత ఆలస్యం జరిగింది. అయినా ఫిబ్రవరి నెలలో బాలలయం ఏర్పాటు చేసి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేశారు. ఆ విధంగా దినదిన ప్రవర్ధమానమై కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుడు ఆయన పెరగడంతోపాటు స్వామివారికి వచ్చే భక్తుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుండడంతో భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆలయం చుట్టుపక్కల ఉన్న భూముల్లో పలు అభివద్ధి పనులను చేపట్టారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిత్య అన్నదాన పథకాన్ని నిరంతరం చేస్తూ కొనసాగిస్తున్నారు. చిత్తూరు నుంచి 11 కిలోమీటర్లు తిరుపతి నుంచి 60 కిలోమీటర్లు మధ్యలో ఉండటం వల్ల తమిళనాడు, కర్ణాటక భక్తులు కూడా భారీ ఎత్తున రావడం జరుగుతుంది. స్వామి వారి ఆదాయం పెరుగుతోంది. వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన అంతరాలయ పనులను పూర్తి చేసి మహా కుంభాభిషేకానికి సిద్ధం చేశారు.










