మెట్టప్రాంత రైతులకు బ్యాంకు సేవలు
ప్రజాశక్తి-ఎఎస్‌పేట : మెట్టప్రాంత రైతులకు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి ఆర్థికాభివృద్ధికి వ్యవసాయాభివృద్ధి తోడ్పాటునందించాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎఎస్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సొసైటీ బ్యాంకును (ఎన్‌డిసిసి) ఆయన ప్రజాప్రతినిధులు, బ్యాంకు ఉన్నతాధికారులతో కలసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి బ్యాంకు భవనాన్ని పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటికి బ్యాంకు అధికారులు తమ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను గురించి వివరించారు. అనంతరం ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎఎస్‌పేటలో ఏర్పాటు చేయడం శుభపరిణామనన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులకు ఇలాంటి బ్యాంకుల ద్వారా అన్ని రకాల సేవలు అందిస్తున్నారన్నారు. రైతులకు త్వరితగతిన రుణాలు అందించేలా బ్యాంకు అధికారులు కృషి చేస్తన్నారని తెలిపారు. ఇలాంటి బ్యాంకులను నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకును సిఇఒను కోరుతున్నామని తెలిపారు. పర్యాటక ప్రాంతమైన ఎఎస్‌పేట దర్గా పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ప్రభుత్వంలో హైలెవల్ కెనాల్ పనులు పూర్తి చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, తప్పకుండా ఎఎస్‌పేట రైతులకు నీటిని అందిస్తామన్నారు. పొదుపు గ్రూపులకు ఈ బ్యాకు ద్వారా 7, 8, 9 శాతానికే రుణాలు అందజేస్తామని బ్యాంకు అధికారులు తెలిపడంతో గృహ నిర్మాణదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన ఎటిఎం ద్వారా 24 గంటలు నగదు తీసుకునే అవకాశం ఉండడంతో యాత్రా స్థలమైన ఎఎస్‌పేటకు వచ్చే యాత్రికులకు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎంఎల్‌ఎ అన్నారు. ఈ సందర్భంగా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసిన, బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన, బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన వారికి ఎంఎల్‌ఎ మేకపాటి ధృవీకరణ పత్రాలు అందజేశారు.










