ప్రజాశక్తి-గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని, పట్టణ శివారు ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా డాక్టరు గేయానంద్, సిపిఎం పట్టణ ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. స్థానిక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది కాలంగా ఆపరేషన్ థియేటర్ లేదన్నారు. గర్భిణులు కష్ట ప్రసవాలకు, అత్యవసర సమయాల్లో ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ, కిడ్నీ, డయాలసిస్ ఇతర అనారోగ్య సమస్యలు వస్తే అనంతపురం, కర్నూలుకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారన్నారు. ఇతర విభాగాల్లోనూ సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల వారు ఆరోగ్యశ్రీ ఉన్నా వైద్యం చేయడం లేదన్నారు. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామనే విధంగా ప్రయివేట్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గుంతకల్లు పట్టణ శివారు ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు, కాలువలు, వీధిలైట్లు తదితర మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు ఇవ్వాలని, ఇల్లు నిర్మించు కోవడానికి రూ.5 లక్షలు రుణాలు ఇవ్వాలని, దుల్హన్, పెళ్లి కానుక పథకాలు ఎటువంటి చదువు నిబంధనలు లేకుండా పేద ప్రజలకి వర్తింపచేయాలన్నారు. రంజాన్, సంక్రాంతి, క్రిస్టమస్ పండుగ సందర్భంగా గతంలో మాదిరి సరుకులు ఉచితంగా పౌరసరఫరాల ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్‌కు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన రిలే దీక్షలు చేస్తున్న నాయకులకు నిమ్మరసం అందజేసి దీక్షలను విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.శ్రీనివాసులు, మండల కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, పట్టణ కార్యవర్గ సభ్యులు మారుతి ప్రసాద్, సాకే నాగరాజు, కసాపురం రమేష్, రంగమ్మ, జగ్గలి రమేష్, పట్టణ కమిటీ సభ్యులు జ్యోతి, చంద్రశేఖర్, ఓబులేసు, షబ్బీర్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సి.రమేష్, వెంకీ, సమీర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.










