Sep 03,2022 23:02

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు నాడు -నేడు కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని చక్కటి వాతావరణంలో పాఠశాలలు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ గుడిపాల మండలంలోని ఆది లక్ష్మాంబపురంలో పర్యటించారు. మొదట జిల్లా కలెక్టర్‌ పాఠశాలను పరిశీలించారు. మొత్తం 7.5 ఎకరాలు ఉందని పాఠశాలలో పిచ్చి మొక్కలు చెత్త లేకుండా చూసుకోవాలని, కాంపౌండ్‌ను ఏర్పాటు చేసుకుని పిల్లలకు కావాల్సిన అన్ని క్రీడలకు సంబంధించి మైదానాలను ఏర్పాటు చేసుకొని అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలలో శారీరక అభివద్ధి ఏదైనా లోపం ఉంటే వెంటనే అందుకు తగిన చర్యలు తీసుకొని అండర్‌ వెయిట్‌ రాకుండా చూడాలని అన్నారు. నాణ్యత గల ఆహారం వారికి ఇచ్చి అండర్‌ వెయిట్‌ ఉన్నవారిని సాధారణ స్థాయికి తీసుకొచ్చి ప్రయత్నాలు వెంటనే చేయాలని అన్నారు. విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండాలంటే మంచి ఆహారం ఇవ్వాలని, మెనూ ప్రకారం వారికి ఆహారం ఇచ్చినట్లయితే వారిలో ఎటువంటి లోపం లేకుండా చక్కని ఆరోగ్యవంతులు గా తీర్చిదిద్ద గలరని అన్నారు సచివాలయంలో బయోమెట్రిక్‌ హాజరును పరిశీలించిన కలెక్టర్‌ మరింత వేగవంతంగా పనిచేసి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా చూడాలని, అందరూ సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు తప్పనిసరిగా పని చేయాలని ఆయన అన్నారు.