చికిత్స అందక బాధితురాలు దుర్గ ఆవేదన
ప్రజాశక్తి - మొగల్తూరు
ముత్యాలపల్లి గ్రామానికి చెందిన తిరుమాని దుర్గ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినా పోలీసుల నుండి మెమో తీసుకురావాలని వెనక్కి పంపారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి . దుర్గకు కోనసీమ జిల్లా అంతర్వేదిక చెందిన తిరుమణి నాగ విష్ణుతో వివాహమైంది. ఈనెల 16న భర్త కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె సోదరుడు కొల్లాటి నరసింహస్వామి నరసాపురంలోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి పోలీసుల నుండి మెమో తీసుకువస్తే వైద్యం అందిస్తామన్నారు. దీంతో ఆమె శుక్రవారం రాత్రి మొగల్తూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. సంఘటన జరిగిన ప్రాంతంలోని ఫిర్యాదు చేయాలని ఇక్కడ ఫిర్యాదు తీసుకోమని పోలీస్ సిబ్బంది తెలిపారు. దీంతో ఆమె వెనుతిరిగింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ జనార్థన్ బాబును వివరణ కోరగా ఆసుపత్రి నుంచి ఎవరినీ పంపించమని, గాయాలతో ఎవరైనా వస్తే చికిత్స అందిస్తామని తెలిపారు.










