Mar 25,2023 22:15

మాట్లాడుతున్న శాస్త్రవేత్త రామసుబ్బయ్య

ప్రజాశక్తి-ఉరవకొండ        రైతులు కాలానుగుణంగా వ్యవసాయ సాగులో మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చని అనంతపురం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రామసుబ్బయ్య, రవికిషోర్‌లు పేర్కొన్నారు. శనివారం ఉరవకొండలోని రైతు భరోసా కేంద్రంలో రైతులకు, సర్పంచులకు, గ్రామస్థాయి వ్యవసాయ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు వారి వ్యవసాయ పొలాల్లో వేసవి దుక్కుల పనులు చేపట్టడం ద్వారా పంటలకు నష్టం కలిగించే క్రీమి, కీటకాలను నివారించవచ్చన్నారు. ప్రతి రైతూ వ్యవసాయ మందులను వాడే విధివిధానాలు తెలుసుకోవాలన్నారు. సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షలు, మిత్ర పురుగుల ప్రాధాన్యత, మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో అధిక రాబడులు సాధించే అంశాలపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు సాగుచేసిన పంటలకు ఏయే తెగుళ్లు సోకుతాయో, పంటలను ఆశించే పురుగులను ఎలా నివారించవచ్చునో వివరించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ డివిజన్‌ ఎడిఎ పద్మజ, వ్యవసాయాధికారి శశికళ, సర్పంచులు నాగప్ప, లింగన్న, యోగేంద్ర రెడ్డి, రైతు భరోసా సిబ్బంది, రైతులు భీమేష్‌, వసికేరప్ప, లాలెప్ప పాల్గొన్నారు.