'మేము మ్యాపింగ్ చేయలేం'
డిఎం అండ్‌హెచ్‌ఒ కార్యాలయం ముందు ఎఎన్‌ఎంల ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
ఏఎన్‌ఎంలను సచివాలయాలకు మ్యాపింగ్ చేయడాన్ని నిలిపి వేయాలంటూ ఏపీ పబ్లిక్ హెల్త్‌అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దశాబ్దాలకాలం పాటు రెగ్యులర్ ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్న వారిని ఉన్నపలంగా సచివాలయాలకు మ్యాపింగ్ చేసి వేరే ప్రదేశానికి వెళ్లాలని సూచించడం దారుణం అన్నారు. మూడు సంవత్సరాల క్రితం సచివాలయ వ్యవస్థ ప్రారంభమైనదని దానికి ముందు నుండే ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను ఉన్నపలంగా వేరే ప్రాంతానికి మ్యాపింగ్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎక్కడెక్కడ పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను రెగ్యులర్ కాంట్రాక్ట్ ఈసీ పద్దుల కింద పనిచేస్తున్న వారిని ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోనే మ్యాపింగ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వందలాదిమంది డిఎంహెచ్వో కార్యాలయం తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్వరం పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మ్యాపింగ్ పద్ధతిని నిలుపుదల చేయాలని నినాదాలు చేశారు. అనంతరం డిఎంహెచ్‌ఓ కార్యాలయానికి రాకపోవడంతో అడ్మినిస్ట్రేటివ్ అధికారి రమేష్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి భోగేశ్వరపిళ్లై, నాయకులు ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.










