మేఘాల దొంగాట..!
నేలరాలని వానమ్మ
దిగాలులో అన్నదాత
జులైలో లోటు వర్షపాతం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
రాష్ట్రంలో గోదావరి జిల్లాలో వానలు ముంచెత్తుతున్నాయి. అయితే మన జిల్లాలో చినుకు జాడ లేకుండా పోతోంది. దీంతో పంటలు పండే పరిస్థితి లేకుండా పోతోంది. జూన్ నెలలో ఓ మోస్తారుగా వర్షాలు కురిసినా జూలైలో వానలే లేకుండా పోయాయి. దీంతో అన్నదాతలు దిగాలు పడుతున్నారు. పంటలు పండించేందుకు తటపటాయిస్తున్నాయి. సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు.
మేఘాల దోబూచులాట
జిల్లాలో మేఘాలు దోబూచులాడుతున్నాయి. ఉదయం నుంచి ఎండలు కాస్తున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నల్లటి మబ్బులేసుకుని భారీ వాన పడుతుందని అందరూ అనుకుంటూ ఉండగానే ఇంతలోనే నాలుగు చినుకులు పడి ఉసూరు మనిపిస్తోంది. జూన్ నెలలో 80.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 123.3 మిల్లీమీటర్ల పడింది. 52.4 మిల్లీమీటర్లు అదనంగా పడింది. దీంతో రైతులు అంతా ఆనంద పడ్డారు. అయితే జూలై నెల ప్రారంభం నుంచి ఈ పరిస్థితి మొత్తం మారిపోయింది. తొలి రోజు నుంచే వర్షాలు లేకుండా పోయాయి. ఈ నెలలో 103.5 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 29.8 మిల్లీమీటర్లే నమోదయ్యింది. 71.2 మిల్లీమీటర్ల లోటు వర్షపాతమ కొనసాగుతోంది. జిల్లాలో ఉన్న 31మండలాల్లో 17మండలాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే అధికంగా పడింది. తొమ్మిది మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది. గుడిపాల మండలంలో వాన జాడే లేకుండా పోయింది.
ముందుకు సాగని ఖరీఫ్
లోటు వర్షపాతం వల్ల జిల్లాలో ఖరీఫ్ సాగు ముందుకు పోవడం లేదు. సాధారణంగా రైతులు జూన్ మొదటి వారం నుంచి జూలై 15వ తేదీ వరకు సాగు చేస్తుంటారు. వేరుశనగ, కంది తదితర వర్షాధార పంటలు వేస్తుంటారు. అయితే వర్షాలు లేకుండా పోవడం వల్ల రైతులు విత్తేందుకు ముందుకు రావడం లేదు. అసలే వేరుశనగ విత్తితే లాభాల మాట అటుంచితే పెట్టుబడి కూడా లేకుండా పోతోంది. దీంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఎక్కువ మంది రైతులు వేరుశనగ, ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలను కొనుగోలు చేసి విత్తేందుకు ఎదురు చూశారు. అయితే జూలై నుంచి ఆశించిన మేర వానలు లేకుండా పోవడం వల్ల విత్తేందుకు ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రభావం సాగు విస్తీర్ణంపైన పడింది. సీజన్ ప్రారంభమై 45రోజులు గడుస్తున్నా చాలామంది మడకలు కూడా దున్నడం లేదు. ఈ ఖరీఫ్‌లో మన జిల్లాలో 89,447 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 30వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది. కనీసం 60వేల హెక్టార్లలో రైతులు ఏ పంటలూ విత్తలేదు. గత ఏడాది ఇదే సమయానికి ఇక్కడ 35వేల హెకార్టర్లలో పంటలు వేశారు. ఇక వేరుశనగ అయితే 55వేల హెకార్టకు గాను ఇప్పటి వరకు 20వేల హెక్టార్లలో మాత్రమే రైతులు విత్తనాలు విత్తారు.










