Apr 11,2023 22:01

విలేకరులతో మాట్లాడుతున్న ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగజనార్ధన

        అనంతపురం : ఏపీ ఈఏపీ సెట్‌-2023 (ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, అండ్‌ ఫార్మాసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పరీక్షలను మే15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తామని ఈఏపీ సెట్‌ ఛైర్మన్‌, జెఎన్‌టియు విసి రంగజనార్ధన తెలియజేశారు. మంగళవారం నాడు అనంతపురం జెఎన్‌టియు విసి ఛాంబర్‌లో ఈఏపీసెట్‌ కన్వీనర్‌ బి.శోభాబిందు అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈఏపీ సెట్‌కు సంబంధించి మార్చి 10వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు. మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను విద్యార్థుల నుంచి స్వీకరిస్తామన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఉంటే ఏప్రిల్‌ 16 నుంచి 30 వతేదీ వరకు రూ.500 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. మే 1నుంచి 5వతేదీ వరకు రూ.1000, రూ.5 వేల అపరాధ రుసుంతో మే6 నుంచి మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష ఒకరోజు ముందు అంటే మే 14వ తేదీ దరఖాస్తు చేసుకునే వారు రూ.10వేల అపరాధ రుసుంతో దరాఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్న వాటిలో ఏమైనా తప్పులు ఉంటే మే 4వ నుంచి 6వ తేదీలోపు సరి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ఇప్పటికి 2.80 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తు
ఎపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి ఏప్రిల్‌ 11వ తేదీ మంగళవారం వరకు 2,80,779 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అందులో 1,99,588 మంది ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష రాసేందుకు, 80,642 మంది అగ్రికల్చర్‌, ఫార్మాసీ, బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రెండింటికీ దరఖాస్తు చేసుకున్న వారు 729 మంది ఉన్నారన్నారు. పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొం127 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 125, తెలంగాణలో రెండు కేంద్రాలు ఉంటాయన్నారు.
ఇంటర్‌కు 25 శాతం మార్కుల వెయిటేజీ
పరీక్షల సిలబస్‌ విషయానికి వస్తే ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 70 శాతం సిలబస్‌లోని ప్రశ్నలు, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి సిలబస్‌లోని ప్రశ్నవలి ఉంటుందన్నారు. ఈఏపీసెట్‌లో వచ్చిన 75శాతం మార్కులకు తోడు ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల విషయంలో విద్యార్థులు ముందుగా మూడు అప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. మొదటి ప్రాధాన్యత ఇచ్చిన సెంటర్‌లో విద్యార్థులు పరీక్షలు రాసేలా అవకాశం ఇస్తామన్నారు. మే 9వ తేదీ నుంచి విద్యార్థులు హల్‌ టికెట్లు ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎపీ ఈఏపీ సెట్‌ కో కన్వీనర్‌ భానుమూర్తి, జెఎన్‌టియు రెక్టార్‌ ఎం.విజయకుమార్‌, పిఆర్‌ఒ రామశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.