Apr 21,2023 08:33

విలేకరులతో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌

         అనంతపురం కలెక్టరేట్‌ : అంగన్‌వాడీ వర్కర్‌లు, హెల్పర్‌లు, మినీ వర్కర్స్‌ ఎదుర్కొంటున్న ధీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ మే 24వ తేదీన గుంటూరులోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ తెలిపారు. గురువారం గణేనాయక్‌ భవన్‌లో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శకుంతల, రమాదేవి, కోశాధికారి జమున హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్‌ గౌరవాధ్యక్షులు నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ మేడే కార్యక్రమంలో అంగన్‌వాడీలందరూ పాల్గొనాలని, అన్ని మండలాల్లో కార్మికుల జెండా ఆవిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించేలా మే 24 నుంచి ఆందోళనలు చేపడుతునట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌కు కనీస వేతనాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదని చెప్పారు. పర్యవేక్షణ పేరుతో వేధింపులూ అధికం అయ్యాయన్నారు. ఈ సమస్యల పరిస్కారానికి పోరాటాలే మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ పది ప్రాజెక్టుల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.