Jul 25,2023 21:35

ఆపరేషన్‌ వివరాలను వెల్లడిస్తున్న సవీరా వైద్యులు సందీప్‌

         ప్రజాశక్తి-అనంతపురం మెడ దగ్గర ఉండే రక్తనాళం పూర్తిగా పూడుకుపోవడంతో మెదడుకు రక్తసరఫరా తగ్గిపోయి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన వృద్ధురాలికి అనంతపురంలోని కిమ్స్‌ సవీరా వైద్యులు సకాలంలో గుర్తించి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆసుపత్రికి చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మూడే సందీప్‌ వెల్లడించారు. అనంతపురానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి కుడిచెయ్యి, కుడికాలు బాగా బలహీనపడటంతో ఒక న్యూరాలజిస్టు వద్దకు వెళ్లారు. ఆ సమస్యను బ్రెయిన్‌ స్ట్రోక్‌ అని నిర్ధారించారు. ఎంఆర్‌ఐ తీస్తే ఒక రక్తనాళం బ్లాక్‌ అయినట్లు తెలిసింది. అందుకు కారణాలు ఏంటని మరింత లోతుగా పరీక్షలు చేయగా... గుండె నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన కెరోటిడ్‌ రక్తనాళం (ఇది మెడ దగ్గర ఉంటుంది) 99 శాతం బ్లాక్‌ అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇది చాలా సంక్లిష్టమైన సమస్య కావడంతో అక్కడినుంచి కిమ్స్‌ సవీరా ఆస్పత్రికి పంపారన్నారు. దానికి స్టెంట్‌ వేయడం మెరుగైన మార్గం కావడంతో, అందుకు అవసరమైన పరికరాలు అన్నింటినీ సేకరించి, కెరోటిడ్‌ ఆర్టెరీ స్టెంటింగ్‌ (సీఏఎస్‌) చేశామన్నారు. దీంతో మెదడుకు రక్త సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించామన్నారు. అంతేగాకుండా రోగి పూర్తిగా కోలుకున్నట్లు వివరించారు. ఇదంతా కేవలం లోకల్‌ ఎనస్థీషియాతోనే చేశామన్నారు. రాయలసీమలోనే 99శాతం బ్లాక్‌ అయిన మెడ రక్తనాళానికి స్టెంట్‌ వేయడం ఇదే మొట్టమొదటి సారి అన్నారు. ఇదంతా ఆరోగ్యశ్రీ పథకంలోనే చేశామన్నారు.