మాట్లాడుతున్న డాక్టర్లు
మెడికవర్‌లో
ప్రపంచ ట్రామా డే పై అవగాహనా
ప్రజాశక్తి-నెల్లూరు :ప్రపంచ ట్రామా డే ని పురస్కరించుకొని మెడికవర్ వైద్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ట్రాఫిక్ డిఎస్‌పి ఎండి అబ్దుల్ సుభాన్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో గాయపడిన వారి ప్రాణాలను రక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణనష్టాన్ని ఏ విధంగా నివారించాలన్నదే ప్రపంచ ట్రామా డే ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. మితిమీరిన వేగం, హెల్మెట్ లేకపోవడం వంటి పలు కారణాలతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. దేశంలో సగటున ప్రతిరోజూ 1000 కి పైగా రోడ్డు ప్రమాదాలు, 400 కి పైగా మరణాలు నమోదవుతున్నాయన్నారు.వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, ప్రతి సంవత్సరం 50 లక్షల మందికి పైగా గాయం కారణంగా మరణిస్తున్నారు. ఇది ప్రతి ఆరు సెకన్లకు ఒక మరణం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాలలో 9 శాతానికి సమానం. ఏటా భారతదేశంలో 10 లక్షల మంది గాయాల కారణంగా చనిపోతారని, మరో 2 కోట్ల మంది ఆసుపత్రుల్లో చేరుతారని అంచనా. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఆవేదన వ్యక్తం చేశారు. మెడికవర్ హాస్పిటల్స్ నేషనల్ హైవే పక్కనే ఉండటంవల్ల తమ ఆసుపత్రి ప్రమాదానికి గురైన ఎంతోమంది ప్రాణాలను రక్షించగలిగిందన్నారు.ఎమర్జెన్సీ విభాగం డాక్టర్ కష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంటలోపల( గోల్డెన్ హవర్ ) బాధితుడిని ఆసుపత్రిలో చేర్చ గలిగితే అతనికి తక్షణ వైద్యం అంది అతను రక్షింప బడే అవకాశం వుంటుందన్నారు.ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో స్పందించడం, వారిని ఎంత త్వరగా హాస్పిటల్స్ కి చేర్చగలిగితే మనం అంతగా ప్రాణనష్టం, ఇతర పరిస్థితుల నుంచి కాపాడినవాళ్ళం అవుతామని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఆర్థోపెడిక్ డాక్టర్ కుమార్ బాబు, న్యూరో సర్జన్ డాక్టర్ దినేష్ గంగపట్నం, న్యూరో సర్జన్ ధీరజ్,ఆర్థోపెడిక్ డాక్టర్ భాను ప్రకాష్, మెడి కవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ ధీరజ్ రెడ్డి, మెడి కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ బిందు రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.










