Mar 25,2023 22:18

ర్యాలీ నిర్వహిస్తున్న మెడకల్‌ విద్యార్థులు

ప్రజాశక్తి-అనంతపురం       సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ జి.భాస్కర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ రవితేజ, డాక్టర్‌ భాస్కర్‌బాబు ఆధ్వర్యంలో జిల్లా పోలీసు శాఖ, ట్రాఫిక్‌ పోలీస్‌ శాఖ, ఆర్టీవో శాఖ, మెడికల్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌, డిడి ఫార్మా, ఇంటాస్‌ ఫార్మ సంయుక్త ఆధ్వర్యంలో అనంత నగరంలో మెదడుకు కలిగే గాయాల నివారణపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులతో, స్లోగన్లతో, పోస్టర్లతో, కరపత్రాలతో అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుంచి తెలుగు తల్లి విగ్రహం, అంబేద్కర్‌ విగ్రహం, సప్తగిరి సర్కిల్‌ నుంచి తిరిగి సాయి నగర్‌ మీదుగా ప్రభుత్వ వైద్య కళాశాల వరకు ర్యాలీని నిర్వహించారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆచార్య డాక్టర్‌ కెఎల్‌ సుబ్రహ్మణ్యం, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ జి.భాస్కర్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ హనుమంతు మాట్లాడుతూ మన మెదడులో కలిగే ఆలోచనలను నియంత్రించుకుని అతివేగంగా డ్రైవింగ్‌ చేయకుండా, హెల్మెట్‌, సీటు బెల్టు, ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామని తెలిపారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ భాస్కర్‌ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశంలో అతి వేగం కారణంగా, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా ఎక్కువమంది యాక్సిడెంట్లకు గురై మెదడు గాయాలకు గురవుతున్నారని తెలిపారు. అందుకే రోడ్డు భద్రతా ప్రమాణాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సూపర్‌ స్పెషాలిటీ సూపరింటెండెంట్‌ ఆచార్య డాక్టర్‌ కెఎల్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగంలో ఉన్న సౌకర్యాలను ప్రజలు ఉపయోగించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు. అనంతరం సూపర్‌ స్పెషాలిటీ న్యూరో సర్జరీ విభాగ సెమినార్‌ హాల్లో నిర్వహించిన సదస్సులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవితేజ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రోడ్డు ప్రమాదాలను, మెదడుకు కలిగే గాయాలను నియంత్రించుకోవడంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆసుపత్రిలోని సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్టీవో ఆఫీసర్‌ సురేష్‌ నాయుడు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆచార్య డాక్టర్‌ జి.రఘునందన్‌, ఆర్‌ఎంఒ డాక్టర్‌ వైవి.రావు, కార్డియాలజీ విభాగాధిపతి సహచార్య, డాక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మనోరంజన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.