అనంతపురం ప్రతినిధి : వైసిపి రాష్ట్ర కార్యదర్శి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు వై.మధుసూదన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వైసిపి జిల్లా కన్వీనర్ పైలా నరసింహాయ్య బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షురాలి భర్త, మాజీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళారం నాడు హిందూపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగానున్న మహమ్మద్ ఇక్బాల్ స్థానంలో దీపికారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రోజు మరో ఇద్దరిపై పార్టీ చర్యలకు సిద్ధపడటం చర్చనీయాంశమవుతోంది. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి, ఆయన తనయుడు ప్రణరుపై గత కొన్ని రోజులుగా భూ అక్రమాణ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని బలపరుస్తూ భూ అక్రమాల్లో వైసిపి నాయకుల ప్రమేయం ఉందంటూ గతనెల 29వ తేదీన మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యనించారు. పార్టీ నాయకులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఆరోపణలు చేసిన మధుసూదన్‌రెడ్డిపై వేటువేస్తూ నిర్ణయం చేసింది. అదే సందర్భంలో ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి పర్యటన నార్పలలో జరిగిన సమయంలో ఆయన్ను కలువకుండా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆయన భర్త విద్యాశాఖ సలహదారు సాంబశివారెడ్డి అడ్డుకున్నారంటూ చామలూరు రాజగోపాల్ ఆరోపించారు. దీనిపైనా వివరణ కోరుతూ ఆయనకు జిల్లా కన్వీనర్ పైలా నరసింహయ్య షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
వైసిపి ప్రక్షాళన మొదలు పెట్టిందా.?
2024 సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో గ్రూపు తగాదాలు పెరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గత నెలలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశమై వివరాలు సేకరించారు. దీని ఫాలోఆప్‌గానే గత వారంలో తిరుపతిలో నియోజకవర్గ ఎమ్మెల్యేలతోనూ విడివిడిగా సమావేశమై సర్వే రిపోర్టులు, నియోజకవర్గాల్లో నేతల పనితీరు అన్నీంటిపైనా చర్చించారు. అనంతరం వరుసగా పార్టీలో మార్పులు, చేర్పులు చేపట్టడం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. హిందూపురం మార్పు జరిగిన మరుసటి రోజే మరో ఇద్దరిపై చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశమైంది. వివాదాలున్న మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తీరున చర్యలుంటాయా అన్నది కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల సమయం వచ్చే సరికి వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇటువంటి చర్యలు తప్పవన్న హెచ్చరికను సైతం జిల్లా కన్వీనర్ పైలా నరసింహయ్య జారీ చేసిన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. దీన్ని బట్టి పార్టీకి వ్యతిరేకంగా బాహాటంగా ఎవరు మాట్లాడినా వేటు పడటం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.










