ప్రజాశక్తి-నెల్లూరు : రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరుగుతుందని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇంటి వెనుక గేటు నుంచి లోపలకు రూ. 30 వేల కోట్లు చేరుతున్నాయంటూ బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన నగరంలో ఆంధ్రప్రదేశ్ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్రంలో మద్యం కుంభకోణం గురించి పత్రికలకు విడుదల చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడారు. ఒక మహిళగా మద్యంపైన చేసే పోరాటంలో భాగంగా మద్యం విధానాన్ని పరిశీలించి, రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్దకు వెళ్లిడమే కాకుండా మద్యం సేవించే వారి కుటుంబ సభ్యల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో రూ.30 వేల కోట్లు ప్రజాధనం ముఖ్యమంత్రి ఇంటికి చేరుతుందని బాహాటంగా ప్రకటించిందన్నారు. ఈ రాష్ట్రంలో 90 వేల కోట్ల మేరకు మద్యం వ్యాపారం జరిగితే రూ.30 వేల కోట్ల మేరకు ఆదాయం తాడేపల్లిలోని సిఎం ఇంటి వెనుక గేటు నుంచి లోపలికి చేరుతుందని ఆరోపణలు చేశారని, ఇది వాస్తవమని రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు చెబుతున్నాయన్నారు. ఇటువంటి సమయంలో చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వానికి చెందిన నాయకులు కేవలం పత్రికా ప్రకటనలకు పరిమితం కాకూడదన్నారు. జిఎస్‌టి విధానం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని, జిఎస్‌టి పాలసీ కేంద్ర ఆర్థిక మంత్రి దగ్గర పనిచేస్తుందన్నారు. జిఎస్‌టి రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో అన్ని విభాగాలమీద పనిచేస్తుందన్నారు. ఎపిలోని మద్యం మీద మాత్రం పనిచేయదన్నారు. మద్యం దుకాణాల్లో జిఎస్‌టి విధానం అమలు కాదని, మద్యం కోసం దుకాణాలు వెళ్లే ఏవరైనా నగదు చెల్లించి తెచ్చుకోవాల్సిందేనన్నారు. ఎవ్వరూ ఫోన్ పే, గూగూల్ పే, క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డులను వాడే పరిస్థితి లేదన్నారు. డబ్బు ట్రాన్‌జాక్షన్ లేనటువంటి భారత దేశాన్ని తాను చూడాలని ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రక్క చెబుతుంటే సిఎం దానిని తుంగలో తొక్కారన్నారు.ఈ నేపథ్యంలో సిబిఐ, ఈడి విచా రణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే విచారణ వెంటనే విచారణ పూర్తి చేసి, రెండు నెలల్లో విచారణ ఆధారంగా ఇన్ని వేల కోట్ల ప్రజాధనం దోచుకున్న వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి, వారి ఆస్తులను తిరిగి జప్తు చేయాలని డిమాండ్ చేశారు.










