ప్రజాశక్తి -మదనపల్లి రురల్ :మదనపల్లె మండలం పోతబోలు, వెంకప్పకోట రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ కోట్ల రూపాయల గ్రావెల్ తరలించిన మైనింగ్ మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పోతబోలు రెవెన్యూ గ్రామం సర్వే నెంబరు 1039లో, వెంకప్పకోట గ్రామంలోని టిడ్కో గఅహాల భూములను ఆదివారం సిపిఎం నాయకులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలు జానెడు స్థలం ఇంటిజాగా కోసం ఆక్రమిస్తే రెవెన్యూ, పోలీస్ అధికార యంత్రాంగం వాలిపోయి, పేదలను భయంబ్రాంతులకు గురిచేయడమే కాకుండా అరెస్టు చేసి, క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారన్నారు. అయితే కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని, యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కు పాల్పడుతూ కోట్ల రూపాయల గ్రావెల్ తరలించిన మైనింగ్ మాఫియాపై కేసులు నమోదు చేయక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ మాఫియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఉండటం వల్లే మదనపల్లె తహశీల్దార్ ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పంధించలేదని ఆరోపించారు. పై అధికారుల ఆదేశాలతో కదిలిన తహశీల్దార్ జెసిబి, టిప్పర్లను మాత్రం సీజ్ చేసి మాఫియాను వదిలేశారంటే ముడుపులు భారీగానే అందాయని ఆరోపించారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకుని మైనింగ్ మాఫియాపై సమగ్ర విచారణ జరిపించాలని, అక్రమ మైనింగ్ కు పాల్పడుతూ, భూకబ్జాలకు పాల్పడున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని, మాఫియాకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడకపోతే పేదలను సమీకరించి భూములు ఆక్రమించి ఉచితంగా పంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమశేఖర, సురేష్ తదితరులు పాల్గన్నారు.










