మాతా శిశుమరణాలు పూర్తిగా తగ్గించాలి: డాక్టర్ రవిరాజు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్ ఇతర శాఖల సమన్వంతో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని జిల్లా ఇమ్మూనైజేషన్ అధికారి డాక్టర్ రవిరాజు అన్నారు. సోమవారం స్థానిక వైద్యఆరోగ్యశాఖ జిల్లా కార్యాలయంలో జూలైలో 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో చోటు చేసుకున్న 12 శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలోని హైరిస్క్ గర్భవతులకు అన్నీ పరీక్షలు నిర్వహించి ప్రణాళిక ద్వారా కాన్పుకు వారం రోజులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వారికి ఆర్థిక రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. తల్లికి అధిక రక్తపోటు, రక్తహీనత, పౌష్టికాహార లోపం వలన కాన్పు సమయంలో జరిగే శిశు మరణాలను వైద్యాధికారులు ముందస్తు ప్రణాళికల ద్వారా నివారించాలని, సరైన పద్ధతిలో కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. కాన్పు అయిన తరువాత వైద్యులు వైద్య సిబ్బంది బాలింతలను సందర్శించి తల్లీబిడ్డ ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన చికిత్సలు అందించి శిశు మరణాలు జరగకుండా చూడాలన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ రవిరాజు










