Apr 26,2023 08:40

హంద్రీనీవా కాలువ

          అనంతపురం ప్రతినిధి : ఈ జిల్లా మనువడు అయిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలుపుకోలేదు. జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో వివిధ సందర్భాల్లో విచ్చేసిన సమయంలో ముఖ్యమైన హామీలు కొన్నింటిని ఆయన ఇచ్చారు. అయితే ఆ హామీలు ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. వీటి సంగతి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యింది. ప్రధానంగా సాగునీటికి సంబంధించి రెండు హామీలిచ్చారు. అవి ఒక్క అడుగూ ముందుకు పడకపోవడం గమనార్హం.
60 రోజుల్లో భూసేకరణ పూర్తి అని హామీ...
2021 జులై 8వ తేదీన జిల్లాలోని రాయదుర్గం మండలంలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్మోహన్‌రెడ్డి విచ్చేశారు. ఈ సమయంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కళ్యాణదుర్గం, రాయదుర్గంకు హంద్రీనీవా నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీటిని అందించే పనులను చేపడతామని హామీనిచ్చారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ 1400 ఎకరాలను 60 రోజుల్లోపు పూర్తి చేస్తామని చెప్పడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీనిచ్చారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. ఉంతకల్లు వద్ద చేపడుతున్న ఆంజినేయస్వామి ప్రాజెక్టును చేపడతామని హామీనిచ్చారు. హంద్రీనీవా కింద 36వ ప్యాకేజీని పూర్తి చేస్తామని హామీనిచ్చారు. అయితే వీటిల్లో ఏ ఒక్కటీ ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. కనీసం భూసేకరణ కూడా పూర్తవలేదు.
అమలుకు నోచని పేరూరు ఎత్తిపోతల హామీ
జీడిపల్లి నుంచి దేవరకొండ, తోపుదుర్తి, ముట్టాల రిజర్వాయరుతోపాటు పేరూరు ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో యుద్ద ప్రతిపాదికన పూర్తి చేస్తామని 2022 జులై 14వ తేదీన సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో జరిగిన పంటలబీమా పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి హామీనిచ్చారు. పేరూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వెంటనే పూర్తి చేస్తామని హామీనిచ్చారు. రెండు సంవత్సరాల కాలంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని హామీని ఇచ్చారు. అయితే ఈ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. భూసేకరణ పనులు ముందుకు సాగలేదు.
ఆరు వేల క్యూసెక్కులకు హంద్రీనీవా పెంచుతామన్నారు...
'ఇప్పుడున్న హంద్రీనీవా కాలువలో 2200 క్యూసెక్కులు మాత్రమే నీరు ప్రవహిస్తోంది. దీన్ని ఆరు వేల క్యూసెక్కులకు పెంచుతాం. దీనితోపాటు అదనంగా ఈ కాలువకు సమాంతరంగా మరో కాలువను నిర్మిస్తాం'. అని 2019వ సంవత్సరం అక్టోబరు 10వ తేదీన అనంతపురం నగరంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సమయంలో మాటనిచ్చారు. ఈ జిల్లాకు మనువడిని.. ఈ జిల్లా పరిస్థితుల పట్ల తనకు స్పష్టమైన అవగాహనుంది అని కూడా చెప్పారు. కానీ ఆచరణలో ఆ పనులు ముందుకు సాగలేదు.
మూడు పర్యటనలు.. మూడు హామీలు..
ముఖ్యమంత్రి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు సార్లు పర్యటించారు. ఈ సమయాల్లో జిల్లాకు సంబందించిన ప్రధానమైన మూడు హామీల్లో ఒక్కటీ పూర్తవలేదు. సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి జిల్లాలో రోజురోజుకు తీసికట్టుగా మారుతోంది. అయితే ఈ మూడు సంవత్సరాల్లో ప్రకృతి సహకారంతో మంచి వర్షాలు పడటంతో నీటి సమస్య ఉత్పన్నమవలేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదన్న అభిప్రాయం రైతు సంఘాల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రధాన సాగునీటి వనరైన తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ దయనీయ స్థితికి చేరింది. ఏ సమయంలో ఎక్కడ గండిపడుతుందోనన్న ఆందోళన జలవనరుల శాఖ అధికారుల్లో సైతముంది. యుద్ధ ప్రాతిపదికన ఈ కాలువ ఆధునీకరణ చేపట్టాల్సి ఉంది. అయితే ఈ పనులను గడిచిన నాలుగేళ్లుగా నిధుల కేటాయింపుల్లేవు. దీంతో రెండేళ్లుగా అధికంగా నీటిని తీసుకునే అవకాశమున్నా కాలువలు పటిష్టంగా లేకపోవడంతో తక్కువ నీటినే తుంగభద్ర డ్యామ్‌ నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దుర్భిక్ష ప్రాంతంగానున్న అనంతపురం జిల్లా సాగునీటి రంగానికి ప్రాధాన్యత కల్పించాలని జిల్లా రైతాంగం వేడుకుంటున్నారు. ఈ రకంగా నిధులు కేటాయించి జిల్లా మనువడిగా సహకారం అందిస్తారని ఆశిస్తున్నారు.