ప్రజాశక్తి-అనంతపురం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్ కళాశాలల రాష్ట్రస్థాయి మార్చ్ ఫాస్ట్ పోటీలలో తృతీయ స్థానంలో నిలిచినట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆరేపల్లి శ్రీదేవి తెలిపారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య డాక్టర్ బాబ్జి చేతుల మీదుగా తమ విద్యార్థులు మెమెంటో అందుకున్నారని చెప్పారు. విద్యార్థులను తీర్చిదిద్దిన కళాశాల ఫిజికల్ డైరెక్టర్ నరసింహ నాయక్‌కు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలలో అనంత మెడికోలు వాలీబాల్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, చెస్ తదితర పోటీలలో పాల్గొనబోతున్నారు. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో 62 మంది మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా తమ వైద్య విద్యార్థులు మంచి ప్రతిభ చూపిస్తున్నారని కొనియాడారు. ప్రారంభోత్సవంలోనే జరిగిన మార్చ్ ఫాస్ట్ పోటీలో తృతీయ బహుమతి సాధించి కళాశాల ప్రతిష్టను రాష్ట్ర స్థాయిలో ఇనుమడింప జేశారన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీదేవి, సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ రఘునందన్, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ కెఎల్.సుబ్రహ్మణ్యం, ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు హర్షం వ్యక్తం చేశారు.










