మాండూస్ వణుకు జిల్లా వ్యాప్తంగా వర్షాలు స్తంభించిన జనజీవనం నిలిచిపోయిన రాకపోకలు అల్లాడిన జనం
మాండూస్ వణుకు
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
స్తంభించిన జనజీవనం
నిలిచిపోయిన రాకపోకలు
అల్లాడిన జనం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
మాండూస్ తుపాను జిల్లాను వణికించింది. చలిగాలులకు తోడు, వర్షం వల్ల జిల్లా మొత్తం తల్లడిల్లింది. అన్ని మండలాల్లో తుపాను ప్రభావం కనిపించింది. రహదారులు కొట్టుకుపోవడం వల్ల పలుప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. వేరుశనగ, నువ్వులు వంటి పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. చెరువుల్లోకి భారీగా నీరుచేరింది. రిజర్వాయర్లు పొంగిపొర్లాయి.
అధికంగా రామకుప్పంలో..
బంగళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ప్రభావం జిల్లాలో స్పష్టంగా కనిపించింది. శనివారం సాయంత్రం ఆరుగంటల వరకు అందిన సమాచారం ప్రకారం జిల్లా వ్యాప్తంగా 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా రామకుప్పంలో 55 మిమీ, వి.కోటలో 50 మిమీ, శాంతీపురంలో 40.4 మిమీ లెక్కన వర్షపాతం నమోదయ్యింది. అత్యంత తక్కువగా విజయపురంలో 0.04 మిల్లీమీటర్లు పడింది. శనివారం నగరి ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాలు శనివారం ఎక్కువగా కుప్పం నియోజకవర్గంలో నమోదయ్యింది. అలాగే పుంగనూరులోని సోమలలో కూడా వర్షం ఎక్కువగా కురిసింది.
నేలకొరిగిన వృక్షాలు.. తెగిన కరెంటు తీగలు..
భారీగా వీస్తున్న గాలుల వల్ల భారీ వక్షాలు నేలకొరిగాయి. 149 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. కొన్నిప్రాంతాల్లో కరెంటు తీగలు తెగిపోతున్నాయి. దీంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటివరకు విద్యుత్‌శాఖకు తొమ్మిది లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. అలాగే పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చరింది. సోమలలో నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో కలికిరికి రాకపోకలు స్తంభించాయి.
328 మందికి పునరావాసం
మండూస్ తుపాను ప్రభావం వల్ల జిల్లావ్యాప్తంగా ఆరు మండలాల్లో 11 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 328 మందికి ఆశ్రయం కల్పించారు. సోమల, పాలసముద్రం, నిండ్ర, విజయపురం, నగరి, ఎస్‌ఆర్ పురం మండలాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని వసతి గృహాల్లో, పాఠశాల్లో వసతి ఏర్పాటు చేశారు.










