మాలతీచందూర్ సాహిత్యామృతాన్ని పంచారు
ప్రజాశక్తి - గుడిపల్లి
ప్రముఖ రచయిత మాలతీచందూర్ సాహిత్యామృత్యాన్ని సాహితీప్రియులకు పంచారని స్త్రీవాద రచయిత్రి, ఉద్యమ నేత ఓల్గా అన్నారు. ద్రావిడ విశ్వ విద్యాలయం తెలుగుశాఖ ఆచార్య కె.శ్రీదేవి ఆధ్వర్యంలో 'మాలతి చందూర్ ధర్మనిధి ఉపన్యాసాల సదస్సు'ను ఎమినో సెమినార్ హాలులో మంగళవారం నిర్వహించారు. మాలతీచందూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఓల్గా కీలకోపన్యాసం చేస్తూ మాలతీచందూర్ నవలలు చదువుతుంటే ఓ చరిత్రను చదువుతున్నట్లు అనిపిస్తుందన్నారు. ఆమె రచనల్లో స్త్రీలపై జరిగే హింస ఎక్కువగా కనిపిస్తుందని, ఇంట్లో, బయట, చదువుకునే, ఉద్యోగం చేసే చోట పడే హింసను తన రచనల్లో తెలిపేవారన్నారు. స్త్రీ సంపాదనను వేడినీళ్లకు చల్లనీరులా మొదట చూశారని, ప్రస్తుతం స్త్రీల సంపాదన ఊహకు అందకుండా ఉందన్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో స్త్రీలు ఎలా నెగ్గుకురావాలన్నది ఆమె నవలల్లో కనిపిస్తుందన్నారు. స్త్రీల మనస్తత్వ చిత్రణ ఆమె నవలల్లో కనిపిస్తుందని, చందూర్ నవలలు చదివితే స్త్రీలకు ఒక శక్తి వస్తుందన్నారు. ప్రస్తుత సామాజిక సమస్యల గురించి స్త్రీలు భయడపకుండా చర్చించుకోవాలన్నారు. పురుషులు సైతం స్త్రీలను అర్ధం చేసుకుని వారికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగించాలన్నారు. మనిషికి సౌందర్యమనేది అంతరంగం నుంచి రావాలని, బాహ్య సౌందర్యం ఇష్డపతామని, కానీ అసలు ప్రధానమైనది అంత్ణ సౌందర్యమని మాలతీచందూర్ తన నవలల్లో నిరూపించారన్నారు. మొహాలు జ్ఞానంతో వెలగాలే కానీ, క్రీములతో కాదని అన్నారు.
వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ మాట్లాడుతూ సుప్రసిద్ధ రచయిత్రి మాలతీచందూర్ మూడు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించారన్నారు. మాలతీచందూర్ ఓ గృహిణిగా ఉండి ఉంటే ఈరోజు ఇంతమంది ఇక్కడ చేరి మాలతీచందూర్ గురించి ఒక ధర్మనిధి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసి ఉండేవాళ్లం కాదన్నారు.మాలతీచందూర్ 1928 ప్రాంతం నూజివీడు ప్రాంతంలో జన్మించారని, ఆడపిల్లలు బడికి సైతం వెళ్లే పరిస్థితులు లేకున్నా ఆమె వాటిని పట్టించుకోకుండా 15 ఏళ్లకే ఆమె రచనలు ప్రారంభించారన్నారు. రెక్టార్ ఆచార్య టినురాధ, తులనాత్మక భాషా అధ్యయన పీఠాధ్యక్షులు ఆచార్య బి.శివకుమార్, శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు, స్త్రీవాద రచయిత్రి మందరపు హైమవతి, కడప యోగివేమన విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ టి.రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రముఖ స్త్రీవాద రచయిత ఓల్గాను సత్కరిస్తూ...










