Nov 03,2023 21:42

ఫొటో : జక్కా వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు

మాజీ ఎంఎల్‌ఎ జక్కా వెంకయ్యకు ఘన నివాళులు
ప్రజాశక్తి -కావలి రూరల్‌ : మాజీ ఎంఎల్‌ఎ, సిపిఎం సీనియర్‌ నేత జక్కా వెంకయ్య 93వ జయంతి సందర్భంగా శుక్రవారం సిపిఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కార్మికులు గంగపట్ల వెంకటేశ్వర్లు, గంగపట్ల చిన్నమ్మ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ మార్క్సిస్టు పార్టీ పోరాటాలలో జక్కా వెంకయ్య వేగుచుక్క అని భూస్వామ్య రాజకీయాలు, పెత్తందారులు రాజ్యం ఏలుతున్న రోజులలో పేద ప్రజలకు అండగా తానున్నానంటూ ముందుకొచ్చి నిలిచిన మహానీయుడని తెలిపారు. దామరమడుగు గ్రామంలో 1930 నవంబర్లో జన్మించిన వెంకయ్య చిన్న వయసులోనే గ్రామంలో పెత్తందారులకు వ్యతిరేకంగా పేదలకు రక్షణగా ఉండేవారని తెలిపారు. 1957లో దామరమడుగు సర్పంచిగా ఎన్నికై గ్రామ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారన్నారు.
సిపిఎం పార్టీ తరఫున అల్లూరు ఎంఎల్‌ఎగా రెండుసార్లు గెలిపొంది, జిల్లా ప్రజానీకానికి ఎంతో సేవ చేశారని తెలిపారు. అంతేకాకుండా సిపిఎం పార్టీలో ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తూ భూపోరాటాలతో పాటు ప్రజా సమస్యలు రైతు సమస్యల పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేసిన వెంకయ్య రైతులకు సాగునీరు గిట్టుబాటు ధరల కోసం పేదలకు భూములు పంచడంతోపాటు ఇళ్ల స్థలాలను పంచిన మహా నాయకుడు అని కొనియాడారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలకు ఎంతో ధైర్యాన్ని నింపుతూ మార్క్సిస్టు పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. మార్క్సిస్టు పార్టీ ఉద్యమాలకు ఎన్నో సలహాలు ఇస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ అలుపెరగని పోరాటాలు నడిపిన చరిత్ర వెంకయ్యదని, ఆయన లేని లోటు తీరనిదన్నారు. వెంకయ్య ఆశయాలను కార్యకర్తలు పునికి పుచ్చుకొని ముందుకు తీసుకుని వెళ్తామని, ఆయనపోరు బాటలోనే కార్యకర్తలు పయనించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఎస్‌.వెంకయ్య, సిఐటియు నాయకులు వై.కృష్ణమోహన్‌, డివైఎఫ్‌ఐ నాయకులు పి.పెంచల నరసింహ, కె.ప్రభాకర్‌, ప్రవీణ్‌, సిఐటియు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.