Mar 03,2023 18:57

జిల్లా ఎస్‌పికి డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతల వినతి
ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలో మాదకద్రవ్యాలను అరికట్టాలని జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌కు శుక్రవారం డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పెద్దిరాజు మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు భవిష్యత్తులో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రముఖులు, వైద్యులతో అవగాహనా సదస్సులు నిర్వహించనున్నమన్నారు. దీనికి పోలీస్‌ శాఖ నుంచి తోడ్పాటు అందించాలని కోరారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గేదెల ధనుష్‌ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జరిగిన అత్యాచారాలకు నేరాలకు మూల కారణం మత్తు పదార్థాల వినియోగమే అన్నారు. స్పందించిన జిల్లా ఎస్‌పి రవిప్రకాష్‌ మాట్లాడుతూ జిల్లాలో అనేక చోట్ల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పలు విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్‌ పేరుతో కమిటీలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో డ్రగ్స్‌ సరఫరాకు, వినియోగానికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థి, యువకుల భవిష్యత్తును కాపాడడానికి డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ చేస్తున్న కృషిని అభినందించారు.