
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్ లేకుండా చేస్తుందని... విద్యార్థులు, యువత దీన్ని గ్రహించి వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరి సహకారం అవసరమన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీకి కన్వీనర్‌గా ఎస్‌పి, ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్, సబ్ కలెక్టర్, ఆర్‌డిఒలు, డిఇఒ, డిఎంహెచ్, జిల్లా వ్యవసాయాధికారి సభ్యులుగా ఉంటారని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం శతశాతం లేకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై కళాశాలల యాజమాన్యాలు దృష్టిసారించాలన్నారు. తల్లిదండ్రులకు పిల్లలపై నియంత్రణ లేక డ్రగ్స్, గంజాయి బానిసలవుతున్నారని చెప్పారు. డ్రగ్స్ వినియోగంపై ఎవరి వద్దనైనా సమాచారం ఉంటే, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు. గంజాయి వినియోగం వల్ల అనర్థాలపై జిల్లావ్యాప్తంగా తరచుగా సదస్సులు నిర్వహించాలన్నారు.
జిల్లాలో గంజాయి సాగు లేదని, కొన్ని ప్రాంతాల్లో వినియోగం ఉన్నట్టు సమాచారం ఉందని ఎస్‌పి జి.ఆర్ రాధిక తెలిపారు. వినియోగం, రవాణాపై గట్టి నిఘా ఉంచామన్నారు. ఒడిశా నుంచి ఇవి జిల్లాకు రాకుండా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర వాహన తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎస్‌ఇబి, రైల్వే అధికారులను సమన్వయం చేసుకుంటూ గంజాయి రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ట్రాన్స్‌పోర్టు, పార్సిల్ సర్వీసులు రవాణా జరిగే సరుకులు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని నోటీసులు ఇచ్చామన్నారు. రాత్రివేళల్లో లాడ్జీల తనిఖీలు నిర్వహించి కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఇబి జెడి ఎన్.మణికంఠ, ఎఎస్‌పి టి.పి విఠలేశ్వర్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, ఆర్‌డిఒలు బి.శాంతి, సీతారామ్మూర్తి, డ్రగ్ కంట్రోలర్ ఎడి, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.