Jul 12,2022 23:08

దలవాయిపల్లి పాఠశాలకు తాళాలు
మా స్కూల్‌.. మా ఊర్లోనే ఉంచండి..
విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన
నాడు- నేడులో రూ.15లక్షలతో పాఠశాల అభివృద్ధి
ప్రజాశక్తి- యాదమరి

మా పాఠశాలను మా ఊర్లోనే ఉంచండి అని దలవాయిపల్లి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాలకు తాళాలు వేసి పాఠశాల ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల అభివద్ధికి రూ.15 లక్షల ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ పాఠశాలలో మొత్తం ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు 130మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య బాగా ఉన్న పాఠశాలను విలీనం చేయడం దారుణం. అన్ని వసులతులతో అభివద్ధి చేసి ఇప్పుడు ఉన్నఫలంగా పాఠశాలను విలీనం చేయడంతో గ్రామస్తులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలకు పెద్దఎత్తున వచ్చి పాఠశాల యూపీ సెక్షన్‌ మ్యాపింగ్‌ను రద్దు చేయాలని నిరసన తెలియజేశారు.
విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ దలవాయిపల్లి గ్రామంలో అధికసంఖ్యలో ముస్లిం మైనారిటీ విద్యార్థులు చదువుతున్నారని, దలవాయిపల్లి గ్రామం నుండి పి.గొల్లపల్లి గ్రామంకు మూడు కిలోమీటర్లు దూరం ఉంది. అయితే ప్రభుత్వ అధికారులు మూడు కిలోమీటర్లకు 100 మీటర్లు తక్కువగా ఉందని దలవాయిపల్లి పాఠశాలను పి.గొల్లపల్లి పాఠశాలకు మ్యాపింగ్‌ చేయడం అన్యాయమన్నారు. యుపి సెక్షన్‌ విద్యార్థులను, ఉపాధ్యాయులను తరలించడంతో విద్యార్థులు ఎక్కువ శాతం మంది చదువుకు దూరం అవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రభుత్వం గత సంవత్సరం నాడు- నేడు కార్యక్రమంలో దలవాయిపల్లి ప్రాథమిక పాఠశాలకు రూ.15లక్షల ఖర్చుపెట్టి పాఠశాల భవనాలు అన్ని రకాలుగా ఆధునీకరించారు. పాఠశాల ప్రహరీ నిర్మాణం, విద్యార్థులకు మరుగుదొడ్లు, తాగునీరు అన్ని రకాల వసతులను ప్రభుత్వం నిధులు వెచ్చింది అభివద్ధి చేసింది. ఎంత ఖర్చు పెట్టిన తర్వాత పాఠశాలను పి.గొల్లపల్లి పాఠశాలకు వెళ్లాలని మ్యాపింగ్‌ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమ గ్రామం నుండి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే ప్రతిరోజు ఆటోలకు వెళ్లాలి వుంటుంది. ఇక్క బస్సు సౌకర్యం లేదు. అంతదూరం వెళ్లేందుకు ఆడపిల్లలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందువల్ల చాలామంది ముస్లిం మైనారిటీ విద్యార్థులు పాఠశాల చదువులు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గ్రామంలోని పాఠశాలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని దలవాయిపల్లి గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కోరుతున్నారు. వెంటనే పాఠశాల ప్రారంభించుకుంటే పెద్దఎత్తున పోరాటాలు చేసేందుకు వెనుకాడేది లేదని ఈ సందర్భంగా అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
యూపీ సెక్షన్‌ను దలాయపల్లిలోని కొనసాగించాలి
- యశోద, సర్పంచ్‌ దలవాయిపల్లి
యూపీ సెక్షన్‌ను 6,7,8 తరగతుల విద్యార్థులు ఇక్కడే చదువుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. గ్రామంలో పేదవిద్యార్థులు అధిక సంఖ్యలో ఉండడంతో మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి పాఠశాల చదువుకునే దానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాశాఖ అధికారుల తప్పుడు నిర్ణయాలవల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. కనుక మా స్కూల్‌లోనే చదువు కొనసాగించండి.
మ్యాపింగ్‌ ఆపకుంటే కలెక్టరేట్‌ ముట్టడిస్తాం
- సుబ్రమణ్యం, పాఠశాల చైర్మన్‌ దలవాయిపల్లి
దలవాయిపల్లి పాఠశాలను పి.గొల్లపల్లికు మ్యాపింగ్‌ను అధికారులు ఆపకపోతే ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనుకకు తీసుకోకపోతే దలవాయిపల్లి గ్రామంలోని పేద బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో సహా పెద్దఎత్తున జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడతాం.