చదువుల కోసం ఆడ బిడ్డలను అంత దూరం పంపలేం
మా స్కూల్.. మా ఊళ్లోనే ఉంచండి...
విద్యార్థులతో తల్లిదండ్రుల నిరసన
ప్రజాశక్తి- వెదురుకుప్పం :
చదువుల కోసం ఆడ బిడ్డలను అంతదూరం పంపలేమని, మా ఊళ్లోనే .. మా స్కూల్ ఉంచండి అని స్కూల్ ఆవరణలో సోమవారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసన తెలిపారు. అనంతరం ఎంఈఓ విజయకుమార్‌కు వినతిపత్రం అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మండలంలోని తిరుమలయ్యపల్లి పంచాయతీ రెంటాలచేను గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలో రెంటాలచేను, చెంచుగుడి, బాలుపల్లె, చింతలకుంట, చింతల గుంట హరిజనవాడకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని ఇక్కడ తమ పిల్లలకు అన్ని రకాల వసతిగా ఉందని తెలిపారు. ఇప్పుడు ఈ పాఠశాలను నల్లవెంగనపల్లెలో ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వ ఆదేశాలు అందాయని, రోజు పిల్లలు ఐదు కిలోమీటర్లు వెళ్లిరావల్సి ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఈ దారి మొత్తం చెరువులు ఉన్నాయన్నారు. గుట్టల మధ్య దారిలో రావల్సి ఉంటుందని చిన్నపాటి వానలకే అక్కడ చెరువు మొరవలు పోతాయని పిల్లలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ పాఠశాలకు పంపలేమని తెలిపారు.










