ఇళ్లు కట్టనీకుండా అడ్డంకులు
తెల్లగుండ్లపల్లిలో పెత్తందారుల పెత్తనం
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్
. పొద్దున లేచింది మొదలు వాళ్ల మొహం మేం చూడాల్నా.. మా మధ్య వాళ్లు ఉండటానికి వీల్లేదు' అంటూ తెల్లగుండ్లపల్లి దళితవాడపై పెత్తందారులు పెత్తనం చేస్తున్నారు. వాళ్లుండే చోటనే దళితులకు ప్రభుత్వం జాగా చూపించింది. అయితే ఇళ్లు కట్టుకోనీకుండా ఆ ఊరి పెత్తందారులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని దళితులు వాపోతున్నారు. ఈ ఘటన యాదమరి మండలం తెల్లగుండ్లపల్లి పంచాయతీ గొందివాడ్లవూరు దళితవాడలో చోటు చేసుకుంది. ఏళ్ల తరబడి తమకు న్యాయంచేయమని, ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇల్లు నిర్మించుకుందామని ప్రయత్నించిన ప్రతిసారీ అగ్రకులస్తుల కులదూషణలు, దాడులకు గురికావాల్సి వస్తోందని వారు మీడియాతో వాపోయారు. వివరాలిలా ఉన్నాయి.
యాదమరి మండలం తెల్లరాళ్లపల్లి పంచాయతీ గొందివాడ్లవూరు మాదిగవాడలో ఇళ్లు లేనివారికి 1997లో అప్పటి ప్రభుత్వం సర్వే నంబర్ 11/4/1407లో 17 కుటుంబాలకు ఇంటి స్థలాలను మంజూరు చేసింది. అయితే ఈ స్థలాలు పెత్తందారుల పొలాలకు అతి సమీపంలో ఉండడంతో ఆ గ్రామానికి చెందిన అగ్రకులస్తులు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలం భూముల్లోకి దళితులను వెళ్లనీకుండా అప్పటినుంచి అడ్డుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం జగనన్న ప్రభుత్వం అప్పట్లో మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు గృహ రుణాలను మంజూరు చేసింది. ఇళ్లు నిర్మించుకునేందుకు రెవెన్యూ అధికారుల ద్వారా సర్వేయర్‌ను వెంటబెట్టుకుని శనివారం దళితులు వెళ్లారు. అయితే రెవెన్యూ అధికారుల సమక్షంలోనే పెత్తందారులు కులంపేరుతో దూషిస్తూ అక్కడనుంచి తరిమేశారు. దిక్కుతోచని స్థితిలో తమకు కేటాయించిన స్థలం కోసం జిల్లాస్థాయి అధికారులను ఆశ్రయించారు. తమకు కేటాయించిన స్థలంలో ఇళ్లు నిర్మించుకునేలా చూడాలని వేడుకొంటున్నారు.
చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి : కెవిపిఎస్
దళితులకు కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటున్న పెత్తందారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ పశ్చిమ కమిటి జిల్లా కార్యదర్శి కె.సురేంద్ర, సిపిఎం పశ్చిమ కమిటి జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు డిమాండ్‌చేశారు. దళితులకు రక్షణ కల్పించి రెవెన్యూ వారే దగ్గరుండి ఇళ్లు కట్టించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని దళితులకు న్యాయం చేయాలని కోరారు.










