20వ రోజుకు పాలకోడేరు రైతుల నిరసన
ప్రజాశక్తి - పాలకోడేరు
పరిహారం ఇస్తామని భూములు తీసుకుని ఇప్పుడు మొహం చాటేస్తున్న ప్రభుత్వం, అధికారులు మా భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని పాలకోడేరు జగనన్న ఇళ్ల స్థలాలకు భూములిచ్చిన రైతులు హెచ్చరించారు. తమ భూముల్లో ఇళ్ల నిర్మాణానికి పూనుకుంటే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. పాలకోడేరు జగనన్న లేఅఔట్ స్థలాలకు భూములిచ్చిన రైతులు పరిహారం కోసం చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం 20వ రోజుకు చేరాయి. రోజుల తరబడి న్యాయం కోసం దీక్షలు చేస్తుంటే అధికారులు, అధికార ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కె.సత్యనారాయణ, నల్లి రామలక్ష్మి, స్తంభలదీవి సాయిబాబు పాల్గొన్నారు.










