మా బడి ఊర్లోనే ఉండాలి
డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: పూతలపట్టు మండలం వడ్డివాని కండ్రిగ గ్రామస్తులు మా ఊరు బడి ఊర్లోనే ఉండాలని సోమవారం చిత్తూరు డీఈఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి సురేంద్రన్, మహిళా సంఘం నాయకురాలు సావిత్రమ్మలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు 3,4,5 తరగతులను విలీనం చేసి హైస్కూల్‌కి కలపడం వలన ప్రైమరీ చదివే విద్యార్థులు మూడు కిలోమీటర్లు వెళ్లాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్నారు. హైస్కూల్ రోడ్డుకు దూరంలో ఉండటం వలన చిన్నపిల్లలు నేషనల్ హైవే దాటే క్రమంలో ప్రమాదాల జరిగి చనిపోయిన పరిస్థితి కూడా ఉందన్నారు. మరి అలాంటి సందర్భంలో ఊర్లో ఉన్న స్కూల్ మూసి వేయడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు ఆవేదనను అర్థం చేసుకోరా అని ప్రశ్నించారు. ఈ విధంగా జిల్లాలో ఇలాంటి పరిస్థితి 300 స్కూల్ ఉన్నాయని వాటిని వెంటనే విలీనం చేయకుండా ఆపాలని డిమాండ్ చేశారు. ఒకపక్క అంగన్వాడీ, మరోపక్క ప్రైమరీ స్కూలు రెండింటినీ రద్దు చేయడం దారుణం అన్నారు. ప్రభుత్వ స్కూల్‌లను బలోపేతం చేసి పేదలకు సామాన్యులకు అందుబాటులో పెట్టడం మానేసి కార్పొరేటర్లకు అప్పగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం దారుణమన్నారు. గ్రామాల్లో తిరుగుబాటు అవుతున్న అధికారులు,ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకుని ఊర్లో ఉన్న బడిలో కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డివాని కండ్రిగ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ధర్నా అనతరం డిఈఓకు వినతి పత్రం అందించారు.










