ప్రజాశక్తి - వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : రోజు రోజుకీ మద్యం బాబుల ఆగడాలు శతి మించి పోతున్నాయి. ఆదివారం అయితే పాఠశాలలకు సెలవులు దీంతో మందుబాబులు పాఠశాల ఆవరణంలో మందుతో అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ తాగి చిందులేస్తున్నారు. పాఠశాల ఆవరణాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, బస్సు షెల్టర్లలో పూటుగా తాగి అక్కడే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కొందరు వాపోతున్నారు. కట్టడి చేయాల్సిన యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్ల అకతాయిల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అంటున్నారు. తాజాగా దేవళంపేట జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో తాగుబోతులు మద్యం తాగి వీరవిహారం చేశారని స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా ఆ పాఠశాలలో తాగునీటి కొళాయిలను ధ్వంసం చేశారంటున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.










