Jun 30,2023 16:23
  • మరో విద్యుత్ ఉద్యమం తప్పదు 
  • ధర్నాలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, జనసేన డిమాండ్ 

ప్రజాశక్తి-చిత్తూరు : అదనపు రుణాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించరాదని, ప్రజలపై భారం తగ్గించాలని శుక్రవారం చిత్తూరు గాంధీ రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, జనసేన లో ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ రైతులపై పెనుభారంగా మారే షరతులను తిరస్కరించాలని కోరుతున్నది. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి 7 వేల కోట్లు అదనపు రుణం మంజూరు చేయాలంటే తాను ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయాలని షరతులు పెట్టింది. ఈ షరతుల వలన ఇప్పటి వరకు ఉచిత, రాయితీ విద్యుత్‌ను పొందుతున్న రైతులు, ఇతర పేదలు విద్యుత్‌ బిల్లులను ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది.  చెల్లించిన ప్రతి సారీ ప్రభుత్వానికి సబ్సిడీ కోసం నివేదించాలి. ఆ తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం వారి అకౌంట్‌లకు నగదు జమ చేస్తుంది. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక  కుంగిపోతున్న రైతులు ఈ విద్యుత్‌ చార్జీలను భరించలేరు. నేటి సంక్షోభ పరిస్థితుల్లో రైతులకు, పేదలకు తగిన సహాయం చేసి ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై భారాలు వేయడం గర్హనీయం. ఇది క్రమంగా సబ్సిడీలను ఎత్తివేయడానికి చేస్తున్న కుట్ర తప్ప మరొకటి కాదు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలను వ్యతిరేకించాలని రాష్ట్రప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్‌ చేస్తున్నది. ప్రభుత్వం స్పందించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదు అని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజన్ మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఆనాటి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యుత్ పోరాటాన్ని నడిపిందని వామపక్ష పార్టీలు నాయకులు ముగ్గురు ప్రాణలు విడిచారు. అనేక మందిపై కేసులు పెట్టడం వలన 13 సంవత్సరాలు కోర్టులు చుట్టూ తిరిగారు. అయినా కూడా ప్రజల తరఫున వామపక్ష పార్టీలు పోరాటాలు చేయడం ఆపలేదనీ గుర్తు చేశారు. ఈనాటి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు భారం ప్రజలపై వేయడం దారుణమని వెంటనే కరెంట్ చార్జీలను వివిధ రకాల పేరుతో పన్నులు వసూలు చేయడాన్ని ఆపాలని, లేదంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించి బుద్ధి వచ్చే విధంగా చేస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సురేంద్రన్, చైతన్య, జ్యోతి,లోకయ్య, సిపిఐ నాయకులు చంద్ర,గోపి, రమాదేవి, కాంగ్రెస్, జనసేన నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.