Jul 03,2023 21:41

కళ్యాణదుర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి

        కళ్యాణదుర్గం : ఈనెల 8న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను సోమవారం మధ్యాహ్నం కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌తో కలిసి పరిశీలించారు. కళ్యాణదుర్గంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌ జూనియర్‌ కాలేజ్‌ ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ వేదిక సభాస్థలం, ఇతర ఏర్పాట్లపై స్థానిక అధికారులతో కలిసి చర్చించారు. ధర్మవరం రోడ్డు వైపునున్న సిఎం హెలీప్యాడ్‌ పనులు, విఐపి, వివిఐపిల సిట్టింగ్‌ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌, ఆర్టీసీ బస్టాండ్‌ పక్కన ఏర్పాటు చేస్తున్న వాహనాల పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలించారు. వాల్మీకి సర్కిల్‌ నుంచి బైపాస్‌ కూడలి వరకు కలెక్టర్‌ వివిధ శాఖ అధికారులతో కలిసి కాలినడకన నడుస్తూ ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గాన్ని తనిఖీ చేశారు. హెలీప్యాడ్‌ నుంచి సభ వేదిక వద్దకు గౌరవ ముఖ్యమంత్రి కాన్వారుకు సంబంధించి రోడ్డు విస్తరణ, కంపచెట్ల తొలగింపు, విద్యుత్‌ స్తంభాల తొలగింపు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, పారిశుధ్య పనుల నిర్వహణ, పోలీసు భద్రత, బ్యారీకేడ్ల ఏర్పాటు, ట్రాఫిక్‌ నియంత్రణ పనులను వేగవంతంగా పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణానికి చేరుకుని డా||వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. పూర్తయిన భవన నిర్మాణం పనులు సాంకేతిక పరికరాల ఏర్పాటు తదితర అంశాల గురించి సంబంధిత శాఖ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ నిశాంత్‌ రెడ్డి, అనంతపురం ఆర్డీవో మధుసూదన్‌, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, జడ్పీ సీఈవో భాస్కర్‌ రెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్‌ సురేంద్ర, డిపిఒ ప్రభాకర్‌ రావు, డిఎల్‌డిఒ శంకర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.